చైనా (China) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి యునాన్ ప్రాంతంలోని లియాంగుషి అనే గ్రామంలో కొండచరియలు (Land Slides) విరిగిపడటంతో 47 మంది అందులో సజీవ సమాధి అయ్యారు. 200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరగడంతో చాలా మంది నిద్రలో ఉండి తప్పించుకోలేకపోయారని తెలుస్తోంది.
మట్టి పెళ్లల కింద ప్రాణాలతో ఉన్న వారిని కాపాడేందుకు విపత్తు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఇంకా మరణాల సంఖ్యను, గాయాలపాలైన వారి సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఆ 47 మందీ ఇంకా బ్రతికే ఉన్నారన్న ఆశతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో మంచు పెళ్లలు ఉన్నాయని.. కనీసం 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అల్‌జజీరా కథనం పేర్కొంది.
ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు చైనా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. గంసు, షింగాల్ ప్రావిన్సుల్లో ఇటీవలి కాలంలో భారీ భూకంపం సంభవించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి 149 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. వందల ఇళ్లు నేల మట్టమయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇక్కడ వచ్చిన బురద ప్రవాహంలో పడి 1000 మంది గాయపడగా… 14,000 మంది నిరాశ్రయులయ్యారు.