విధాత: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. పూణె జిల్లాలోని అహ్మద్‌నగర్-కల్యాణ్ హైవేపై ధవల్‌పురి ఫాటా సమీపంలో మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర ప్రభుత్వ బస్సు ట్రాక్టర్, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు అహ్మద్‌నగర్-కల్యాణ్ హైవేపై వస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్‌ను, కారును వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప దవాఖానలకు తరలించారు. ఐదుగురిని పార్నర్ రూరల్ దవాఖానకు తీసుకెళ్లగా, ఒకరిని అహ్మద్‌నగర్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. గాయపడిన మరికొందరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మృతుల వివరాలు తెలుసుకుంటున్నామని, ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారందరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్టు తెలిపారు.