మావోయిస్టు అగ్ర నేత హిడ్మా హతం

- మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్
విధాత : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మా(43) మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలలో హెడ్మా పై 50 లక్షల పోలీసు రివ్డారు ఉంది. గతంలో పలు ఎన్‌కౌంటర్‌లలో తప్పించుకుని రెండు దశాబ్ధాలుగా పోలీసులకు చిక్కడు దొరకడుగా తన కార్యకలాపాలతో సవాల్ విసిరిన హిడ్మా మధ్యప్రదేశ్‌లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో గాధి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లుగా పోలీస్ వర్గాలు ప్రకటించాయి. 2023లో ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు చనిపోయారు.
సాయుధ పోరులో నేర్పరి..హిడ్మా
మావోయిస్టు ప్లాటూన్ దళాలను నడిపించడంలో, తుపాకి పేల్చడంలో హిడ్మా నేర్పరి కావడంతో అనేక ఎన్‌కౌంటర్ల నుంచి చనిపోయే ముందు వరకు కూడా ఒక్క గాయం కాకుండా తప్పించుకున్నాడు. గత జనవరిలో సుక్మాజిల్లా ఎల్మాగూడ- బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హిడ్మాను చంపామని ప్రకటించగా, నేను బతికే ఉన్నానని హిడ్మా ఒక లేఖ ద్వారా ప్రకటించి సంచలం రేపాడు. దండకారణ్యంలో పలు మార్లు సాయుధ బలగాలపై దాడులకు నాయకత్వం వహించి వారిని మట్టుబెట్టిన హిడ్మాను గత కొంత కాలంగా కేంద్ర-రాష్ట్ర పోలీస్ బలగాలు టార్గెట్ చేశాయి.
బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా అసలు పేరు మడవి ఇడమా అయినా మడవి హిడ్మాగా స్థిరపడిపోయింది.. ఇతడికి సంతోష్, ఇడ్మాల్ , పొడియం బీమా అన్న పేర్లు కూడా ఉన్నాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పువ్వర్తి హిడ్మా స్వగ్రామం. ఇదే గ్రామం నుంచి దాదాపు 40 మందికి పైగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. 1996-97 ప్రాంతంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన హిడ్మా తన 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరాడు.
మాడావి హిడ్మా, హిద్మల్లు, సంతోష్ పేర్లతో హిడ్మా మావోయిస్టు పార్టీలో పని చేశాడు. హిడ్మా ఏడవ తరగతి వరకే చదివినప్పటికి పార్టీలో ఇంగ్లీష్, హిందీలపై పట్టు సాధించడంతో పాటు ఆయుధాల తయారీ, మరమ్మతుల్లో ఆరితేరాడు. గ్రనేడ్లు, లాంచర్లు స్థానికంగా తయారు చేయడంలో హిడ్మా దిట్ట. అతడు ఫిలిప్పీన్స్‌లో గెరిల్లా వార్‌ఫేర్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. హిడ్మాను ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని చెబుతారు. మావోయిస్టు స్పెషల్ స్క్వాడ్ బృందాలకు శిక్షకుడిగా వ్యవహారిస్తున్నాడు.
మావోయిస్టు పార్టీ నెంబర్ వన్ ఫ్లాటూన్ సారధి హిడ్మానే
2001-07వరకు పార్టీలో సాధారణ సభ్యుడిగా ఉన్న హిడ్మా మావోయిస్టు సాయుధ విభాగం (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) లో చేరాక దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్ విభాగాన్ని బలోపేతం చేస్తూ దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వాజూడుం కార్యకలాపాలను ఎదుర్కోడవంలో క్రియాశీలకంగా పనిచేశాడు. మావోయిస్టు పార్టీ నెంబర్ వన్ ప్లాటూన్ హిడ్మా సారధ్యంలోనే సాగుతుంది.
హిడ్మా ఆదేశిస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లి ఈ ఫ్లాటూన్ దాడులు చేస్తుంది. హిడ్మా ఇన్‌ఫార్మర్ల పేరుతో చేసిన హత్యలు జనంలో హిడ్మా అంటే వణుకు పుట్టించాయి. పోలీసు బలగాలపై దాడులు కూడా హిడ్మా పేరును మరింత వినిపించేలా చేశాయి. హిడ్మా దంపతుల చుట్టు సాయుధ మావోల బృందం నిరంతరం కాపలా సాగిస్తుండటం పార్టీలో హిడ్మా ప్రాధాన్యతకు నిదర్శనం.
2007 సంవత్సరం మార్చిలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు హతమైన దాడికి హిడ్మా సారధ్యం వహించాడు. 2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తార్ తొలి బెటాలియన్ కు కమాండర్ అయ్యాడు. 2011 దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యాడు. 2011 ఏప్రిల్ లో సుక్మాజిల్లా చింతల్నార్ వద్ద సీఆర్‌పీఎఫ్ పోలీసులపై దాడి చేసి 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు.
2017లో 12మంది పోలీసులు హతమైన బూర్కపాల్ దాడి కూడా హిడ్మా సారధ్యంలోనే జరిగిందని పోలీసుల కథనం. మావోయిస్టు పార్టీ సాధరణ సభ్యుడిగా, సాయుధ బలగాల్లో, ప్రజాప్రభుత్వంలో మూడు విభాగాల్లో పనిచేసిన హిడ్మా మావోయిస్టు పార్టీలో ఎదిగిన గిరిజన నేతగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. హిడ్మా గోండియా-రాజ్‌నంద్‌గావ్-బాలాఘాట్ డివిజన్ (మహారాష్ట్ర, ఎంపీ -ఛత్తీస్‌గఢ్ అంతటా విస్తరించిన ప్రాంతం) ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు రాజేష్ అలియాస్ దామాకు హిడ్మా సన్నిహితుడు. హిడ్మా సోదరుడు కూడా మావోయిస్టే కావడం గమనార్హం.