Bihar | ఆమెకు తన బిడ్డ అంటే ఎంతో ప్రేమ. క్షణం పాటు కుమార్తె కనిపించకపోతే తల్లడిల్లే ఆ తల్లి.. కూతురి పెళ్లిని చూడాలనేది ఆమె బలమైన కోరిక. మృత్యువుతో పోరాడుతున్న తల్లి కోరిక మేరకు ఆమె కూతురు ఐసీయూలోనే వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండు గంటలకు తల్లి కన్నుమూసింది. ఈ ఘటన బీహార్‌లోని గయాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గయా జిల్లా బాలి గ్రామానికి చెందిన లాలన్ కుమార్, పూనమ్ వర్మ దంపతులకు ఒక కుమార్తె ఉంది. పూనమ్ వర్మ వృత్తిరీత్యా మగధ్ బోధానసుపత్రిలో ఏఎన్ఎంగా పని చేస్తోంది. గత కొంతకాలం నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్న వర్మకు ఆదివారం మరింత ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు.. గయలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను వైద్యులు పరీక్షించారు. వర్మ ఎప్పుడైనా ప్రాణాలు కోల్పోవచ్చని వైద్యులు చెప్పారు.
దీంతో తల్లి వర్మ తన కుమార్తె చాందిని వివాహం తన చేతుల మీదుగా చేయాలని కోరింది. ఇక క్షణాల్లోనే వైద్యుల అనుమతి మేరకు ఐసీయూలోనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి చాందినీ, సుమీత్ గౌర్ వివాహం జరిగింది. తల్లి కళ్లెదుటే వీరి వివాహం జరగడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కుమార్తెకు పెళ్లి అయిన రెండు గంటలకే పూనమ్ కన్నుమూసింది. వాస్తవానికి డిసెంబర్ 26వ తేదీన చాందినీ, సుమీత్ కౌర్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అంతలోపే ఆమె ఆస్పత్రి పాలు కావడంతో.. ఆమె కోరిక మేరకు ఐసీయూలోనే పెళ్లి జరిపించారు.