విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి 60వ డివిజన్ కార్పొరేటరు అభినవ్ భాస్కర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం వరంగల్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో దాస్యం కుటుంబంలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బాబాయ్ వినయ్ , అబ్బాయి అభినవ్ మధ్య చాలా కాలంగా నేలకున్న అంతర్గత విభేదాలు తాజాగా వెలుగు చూశాయని అంటున్నారు.
– బీఆర్ఎస్‌కు రాజీనామా ప్రకటన
గురువారం బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అభినవ్ ప్రకటించారు. కార్పరేటర్‌గా ఉన్న అభినవ్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్న స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ కుమారుడు. ఈ మేరకు అభినవ్ తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షులు కెసిఆర్‌కు పంపించారు. ఈ లేఖ వివరాలిలా ఉన్నాయి. అభినవ్ రాజీనామా ప్రభావం టిఆర్ఎస్ పై ఎంత ఉంటుంది అనేదానికన్నా, సొంత బాబాయిని కాదంటూ రాజీనామా చేయడమే కాకుండా, ఆయనపై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది.
త్వరలో అభినవ్ బిజెపిలో చేరేందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకున్న అనంతరమే బిఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి శాసనసభ ఎన్నికలకు ముందే బాబాయ్, అబ్బాయి మధ్య విభేదాలు పొడచూపినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఇరువురు రాజీ పడ్డట్లు చెబుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వివాదం మరోసారి బహిర్గతమైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అభినవ్ రాజీనామాకు సిద్ధమైనట్లు చర్చ సాగుతుంది.
వాస్తవానికి దాస్యం కుటుంబంలో ప్రణయ్ భాస్కర్ తొలుత రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు ఆయన ఆకస్మిక మృతి అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ప్రణయ్ భార్య సభిత భాస్కర్ పోటీచేసి ఓటమిపాలయ్యారు. అన్న బ్రతికున్నప్పటినుంచి ఆయన సహచరునిగా ఉన్న వినయభాస్కర్ ఆ తరువాత టిడిపిలో నాయకునిగా ఎదిగారు. టిడిపిలో తనకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి హనుమకొండ ఎమ్మెల్యేగా, చీఫ్ విప్పిగా మొన్నటి వరకు కొనసాగారు. మరో సోదరుడు విజయభాస్కర్ కార్పొరేటర్ గా గతంలో గెలుపొందారు. ఈ క్రమంలో చదువు పూర్తి అయిన తర్వాత హనుమకొండకు వచ్చిన ప్రణయ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ తనకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కుటుంబం పై ఒత్తిడి తేవడంతో విజయభాస్కర స్థానంలో ఆయనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత అభినవ్ భాస్కర్ ఎమ్మెల్యే స్థానంపై కన్నెయ్యడంతో అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే బాబాయి, అబ్బాయి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లు భావిస్తున్నారు. తాజాగా వినయ్ ఓటమితో ఈ విషయాలన్నీ మరోసారి బహిర్గతమైనట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా అభినవ్ పార్టీకి రాజీనామా చేయడంతో గత కొంతకాలంగా తనకు కుటుంబంలో తలనొప్పిగా మారిన సమస్య ఈ రూపంలో పోయిందని వినయ్ భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ వైరం ఇక్కడికే పరిమితం అవుతుందా? బాబాయ్, కొడుకు మధ్య రాజకీయ వైరం ఎలా ఉంటుందనే చర్చ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సాగుతోంది.
– రాజీనామా లేఖ వివరాలిలా ఉన్నాయి
పలుమార్లు అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత స్వర్గీయ మాజీ మంత్రి మా నాన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ తెగువను మీరు కొనియాడారంటూ అభినవ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బిఆర్ఎస్ పార్టీలో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నావంతు కృషి చేశాను, ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశానని వివరించారు.
1997 లో నా తండ్రి మరణించాక, 1999 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ కోసం నా తల్లి టికెట్ త్యాగం చేసినట్లు పేర్కొన్నారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓ పార్టీ నాకు పరకాల టికెట్ అవకాశం కలిపిస్తానన్న బాబాయ్ కోసం నేను. త్యాగం చేసాను. చేసిన త్యాగాలకు గుర్తింపు లేకపోగా తాజా మాజీ ఎమ్మెల్యే మా బాబాయ్ దాస్యం వినయ్ భాస్కర్ తన ఓటమికి నన్ను బాధ్యుడను చేస్తూ ఆయన చేస్తున్న విష ప్రచారానికి ఎంతో బాధపడి నాకు విలువలేని చోట నేను ఉండలేను అనుకొని పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన ఓటమికి నైతిక బాధ్యత వహించకుండా పార్టీ కార్యకర్తలను, నాయకులను నిందించడం సబబు కాదని భావిస్తున్నాని భావించారు.నేను రాజకీయంగా ఏ వేదికపై ఉన్న తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షితుడైన ప్రణయన్న బిడ్డగా ప్రజలకోసం అందుబాటులో ఉంటానని తెలుపుతున్నానని తెలిపారు. సహకరించిన పార్టీ పెద్దలకు దాస్యం అభినవ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.