Adani | అదానీ షేర్లలోకి.. షెల్‌ కంపెనీల నిధులు

Adani | మారిషస్‌ నుంచి మళ్లించారు అవి అదానీ కుటుంబీకుల కంపెనీలే బయటపెట్టిన ఓసీసీఆర్పీ నివేదిక కట్టుకథలంలూ అదానీ గ్రూపు ఖండన దారుణంగా పతనమైన అదానీ షేర్‌లు ముంబై: అదానీ గ్రూప్‌ అక్రమ కార్యక్రమాలను మరో నివేదిక బయటపెట్టింది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశంలో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టి, వాటి విలువను పెంచేందుకు మారిషస్‌లోని షెల్‌ కంపెనీల నిధులను ఉపయోగిం చారని సంఘటిత నేరాలు, అవినీతిపై […]

  • Publish Date - August 31, 2023 / 01:12 PM IST

Adani |

  • మారిషస్‌ నుంచి మళ్లించారు
  • అవి అదానీ కుటుంబీకుల కంపెనీలే
  • బయటపెట్టిన ఓసీసీఆర్పీ నివేదిక
  • కట్టుకథలంలూ అదానీ గ్రూపు ఖండన
  • దారుణంగా పతనమైన అదానీ షేర్‌లు

ముంబై: అదానీ గ్రూప్‌ అక్రమ కార్యక్రమాలను మరో నివేదిక బయటపెట్టింది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశంలో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టి, వాటి విలువను పెంచేందుకు మారిషస్‌లోని షెల్‌ కంపెనీల నిధులను ఉపయోగిం చారని సంఘటిత నేరాలు, అవినీతిపై నివేదించే ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్పీ) నివేదిక బయటపెట్టడం తాజాగా ఈ వివాదాన్ని మళ్లీ చర్చల్లోకి తెచ్చింది.

అదానీ గ్రూపు పబ్లిక్‌ షేర్‌లలో పెట్టిన మారిషస్‌ నిధులు.. అదానీ కుటుంబ వ్యాపార వర్గాలకు సంబంధించినవని ఓసీసీఆర్పీ పేర్కొన్నది. అంటే తన కుటుంబానికి చెందిన షెల్‌ కంపెనీల నుంచి పెట్టుబడులతో తిరిగి తన కంపెనీ షేర్‌లు కొనడం ద్వారా వాటి ధరలను అదానీ గ్రూప్‌ కృత్రిమంగా పెంచిందన్నమాట. అయితే.. సహజంగానే ఈ ఆరోపణలను అదానీ గ్రూపు తిరస్కరించింది. అవన్నీ కట్టుకథలేనని పేర్కొన్నది. ఓసీసీఆర్పీ నివేదిక బయటకు రాగానే అదానీ గ్రూప్‌ షేర్‌లు దారుణంగా పతనమయ్యాయి.

ఏమిటీ ఓసీసీఆర్పీ?

ఓసీసీఆర్పీ అనేది పరిశోధనాత్మక జర్నలిస్టుల ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌. అవినీతిపై ఈ నెట్‌వర్క్‌ ప్రధానంగా దృష్టిసారిస్తుంది. దీనికి జార్జ్‌ సోరోస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ (ఓఎస్‌ఎఫ్‌), రాక్‌ఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫండ్‌ వంటివి నిధులు సమకూరుస్తున్నాయి. ప్రధాని మోదీకి, గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తిన హిండెన్‌బర్గ్‌కూ జార్జ్‌ సోరోస్‌ నిధులు అందించిన విషయం తెలిసిందే.

ఒత్తిడిలో అదానీ గ్రూప్‌ షేర్లు

ఓసీసీఆర్పీ నివేదిక బయటకు రావడంతో షేర్‌ మార్కెట్‌లో గగ్గోలు మొదలైంది. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ విలువ మూడు శాతం పడిపోయింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్‌మార్‌ షేర్‌లు ఒకటి నుంచి ఐదు శాతం వరకూ పడిపోయాయి.

హిండెన్‌బర్గ్‌ 2.0?

ట్యాక్స్‌ హెవెన్‌ దేశాల ఆఫ్‌షోర్‌ కంపెనీలతో అదానీ గ్రూప్‌నకు అక్రమ లావాదేవీలు ఉన్నాయని అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక పేర్కొన్న 8 నెలల తర్వాత మరోసారి ఇదే తరహా ఆరోపణలను ఓసీసీఆర్పీ చేసింది. దశాబ్దంపాటు సాగిన పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

అయితే.. దశాబ్దం క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ పరిశోధనల ఆధారంగా ఓసీసీఆర్పీ ఈ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు పేర్కొంటున్నది. లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని స్వతంత్ర సంస్థలు ఇప్పటికే ధృవీకరించాయని, 2023 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ అంశం పరిష్కారం కూడా అయిపోయిందని వివరణ ఇచ్చింది.