విధాత: హాలో మోదీ జీ.. మీరు ఎలా ఉన్నారు..? మీరు ప్రతి ఒక్కరి మాట వింటారు కదా.. దయచేసి ఒకసారి నా మాట కూడా వినండి.. అంటూ సీరాత్ నాజ్ అనే మూడో తరగతి విద్యార్థిని విడుదల చేసిన 4 నిమిషాల నిడివి గల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అలా మోదీజీకి విన్నవించిందో లేదో.. ఇలా ఆమె చదువుతున్న పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. జమ్మూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవి శంకర్ శర్మ.. ఆ స్కూల్‌ను సందర్శించి, అభివృద్ధి పనులను ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలోని మారుమూల ప్రాంతం లోహై మల్హార్ బ్లాక్‌కు చెందిన సీరాత్ నాజ్.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే తన పాఠశాలలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా మారాయని ఓ వీడియోలో చూపించింది. దుమ్ముతో కూడిన నేలపై కూర్చుంటున్నామని, మా యూనిఫాంలు మురికిగా మారుతున్నాయని, దీంతో తల్లిదండ్రులు కూడా కోపం అవుతన్నారని నాజ్ పేర్కొంది.
టాయిలెట్స్ అన్ని అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపింది. బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా సమస్యలు వస్తున్నట్లు చెప్పింది. అసంపూర్తిగా నిర్మించిన భవనాన్ని పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలని ఆ చిన్నారి మోదీకి విన్నవించింది.
Kashmiri Girl’s Request to Modi | మోదీ జీ.. మాకొక మంచి స్కూలు కట్టించరా?
మీరు దేశం మాట మొత్తం వింటారు. మీరు మా మాట కూడా విని, మంచి స్కూల్ భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. మేం కూడా మంచిగా చదువుకుంటాం.. మా బట్టలు మురికి కాకుండా కూడా ఉంటాయి. మా తల్లిదండ్రులతో కూడా తిట్టించుకునే పరిస్థితి ఏర్పడదని సిరాత్ నాజ్ వీడియోలో మోదీకి తెలిపింది.
ఈ వీడియో విడుదలై వైరల్ కావడంతో.. జమ్మూకశ్మీర్ అధికారులు స్పందించారు. పాఠశాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు.
రూ. 91 లక్షలతో స్కూల్ భవనాన్ని అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పనులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండే.. కానీ కొన్ని కారణాల వల్ల నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
జమ్మూ ప్రావిన్స్‌లోని అన్ని జిల్లాల్లో కొత్తగా వెయ్యి కిండర్ గార్టెన్ పాఠశాలల ఏర్పాటుకు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. 10 జిల్లాల్లో 250 కిండర్ గార్టెన్ పాఠశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మూడు నాలుగేండ్లలో ఇవి పూర్తవుతాయని చెప్పారు.
సంతోషంగా ఉంది : సీరాత్ నాజ్
తాను చేసిన వీడియోకు ఈ స్థాయిలో స్పందన రావడం సంతోషంగా ఉందని సీరాత్ నాజ్ పేర్కొంది. భవిష్యత్‌లో తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని ఆమె తెలిపింది. తన వీడియోతో పాఠశాల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడంతో ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ పనుల ప్రారంభంతో గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని నాజ్ పేర్కొంది.