KCR | మళ్లీ సెంటిమెంట్ వ్యూహామేనా? పాత అస్త్రాన్నే ఎంచుకుంటున్న కేసీఆర్‌

KCR | భారీ సంక్షేమ పథకాలు గెలిపించలేవా! జనాన్ని ఏమార్చేందుకేనంటున్న విపక్షం విధాత, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీలు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పోటాపోటీగా ఎన్నికల హామీలు.. అభ్యర్థుల ఖరారు కసరత్తులో మునిగి తేలుతున్నాయి. అధికార బీఆరెస్ ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ దఫా సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఎదురవుతుందన్న ఆలోచన ఆ పార్టీని భయపెడుతున్నది.. దానిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రస్తుతం తాను […]

  • Publish Date - July 31, 2023 / 01:22 AM IST

KCR |

  • భారీ సంక్షేమ పథకాలు గెలిపించలేవా!
  • జనాన్ని ఏమార్చేందుకేనంటున్న విపక్షం

విధాత, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీలు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పోటాపోటీగా ఎన్నికల హామీలు.. అభ్యర్థుల ఖరారు కసరత్తులో మునిగి తేలుతున్నాయి. అధికార బీఆరెస్ ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ దఫా సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఎదురవుతుందన్న ఆలోచన ఆ పార్టీని భయపెడుతున్నది.. దానిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రస్తుతం తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బలం చాలదన్న ఆలోచనతో ఉన్నారా? అంటే గెలుపు వ్యూహాల వెంట ఆయన పరుగెడుతున్న తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నదని పలువురు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సొంత సర్వేల్లో బీఆరెస్‌కు, చాలామంది సిట్టింగ్‌లకు వ్యతిరేక గాలి వీస్తున్నదని గ్రహించిన కేసీఆర్.. హ్యాట్రిక్ విజయానికి కొత్త వ్యూహాలకు కసరత్తు చేస్తునే, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సంధించేందుకు కూడా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇందుకు తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సమైక్యవాదులైన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యులంటూ మంత్రి టీ హరీష్‌రావు చేసిన విమర్శలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

గెలుపు కోసం ఒకవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్య నేతలకు, వారి గెలుపునకు కీలకంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలకు గాలం వేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తనకు ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల్లో ఢీ కొడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ను బలహీనం చేసేందుకు కేసీఆర్ ఎక్కువగా ఆ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించేందుకు రహస్యంగా ఆపరేషన్ గులాబీ కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు అడపాదడపా రివర్స్ అటాక్‌, డైవర్ట్ పాలిటిక్స్ వ్యూహాలను అనుసరిస్తున్నారని చెబుతున్నారు.

సమైక్యవాదులన్న ముద్రతో రేవంత్‌, కిషన్‌రెడ్డిలపై దాడి

రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌.. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని మళ్లీ ఎలా ప్రయోగించా లన్న దాని పైనా ఫోకస్ పెట్టారని జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి, కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మరోసారి అదే తరహా వ్యూహాన్ని జనంలోకి వదలుతున్నారని అంటున్నారు. కేసీఆర్ ఆలోచనల మేరకే హరీష్‌రావు.. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలకు చంద్రబాబు, నల్లారి కిరణ్‌కుమార్‌ గురువులంటూ విమర్శలు చేశారని అంటున్నారు.

అయితే.. రెండు దఫాలు నడిచిన తెలంగాణ సెంటిమెంట్‌ మూడోసారి కూడా పని చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ ప్రయోగించే తెలంగాణ సెంటిమెంట్ వ్యూహానికి కాలం చెల్లిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏమార్చడానికే మరోసారి తెలంగాణ-ఆంధ్ర సెంటిమెంట్‌ రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ను రద్దు చేసి బీఆరెస్‌గా పేరు మార్చి, దేశమంతా పోటీ చేస్తానని తిరుగుతున్న కేసీఆర్ చెప్పే తెలంగాణ సెంటిమెంట్ మాటలను తెలంగాణ ప్రజలు ఈ దఫా గుడ్డిగా నమ్మబోరంటున్నారు.

కేసీఆర్ ఎన్నికల హామీలు, ఉద్యమ ఆకాంక్షల వైఫల్యాలు.. తొమ్మిదిన్నరేళ్ల పాలన తీరే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశాలుగా ఉంటాయని విపక్ష నేతలు చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి నమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారంటేనే ఆయన పాలనకు ప్రజామోదం లేనట్లుగానే భావించాల్సి ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తున్నది. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అంటూ తెలంగాణ సంక్షేమ పథకాలను గొప్పగా ప్రచారం చేసుకున్న కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం తమ సంక్షేమ పథకాలు గెలుపు సాధనాలు కాలేవన్న అపనమ్మకం ఏర్పడినందునే సెంటిమెంట్ ఎగదోస్తున్నారన్న విమర్శ సైతం వినిపిస్తున్నది.