Maharashtra | మహా రాజకీయాల్లో మరో కుదుపు.. ఎన్సీసీలో చీలక

Maharashtra బీజేపీ ‘మహా’ రాజకీయం! మహారాష్ట్రలో చీలిపోయిన ప్రతిపక్ష ఎన్సీపీ బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ బహుమతిగా ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రులుగా 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారన్న అజిత్‌ నా వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు వారు ఎందుకు వెళ్లారో కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది: శరద్‌పవార్‌ మరింత బలంగా ముందుకొస్తానని ధీమా విధాత‌: మహారాష్ట్రలో శివసేనను చీల్చి.. చీలికవర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఇప్పుడు […]

  • Publish Date - July 2, 2023 / 10:09 AM IST

Maharashtra

  • బీజేపీ ‘మహా’ రాజకీయం!
  • మహారాష్ట్రలో చీలిపోయిన ప్రతిపక్ష ఎన్సీపీ
  • బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌
  • బహుమతిగా ఉప ముఖ్యమంత్రి పదవి
  • మంత్రులుగా 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారన్న అజిత్‌
  • నా వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు
  • వారు ఎందుకు వెళ్లారో కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది: శరద్‌పవార్‌
  • మరింత బలంగా ముందుకొస్తానని ధీమా

విధాత‌: మహారాష్ట్రలో శివసేనను చీల్చి.. చీలికవర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఇప్పుడు ఎన్సీపీనీ నిట్టనిలువునా చీల్చింది. 8 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు. ఆయనతో పాటు ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌, ధనుంజయ్‌ ముండే, మరో ఐదుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్‌.. ఈ పదవిలో కొనసాగాలని లేదని వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దేశం ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నదని అజిత్‌పవార్‌ తన ప్రమాణం అనంతరం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసి ఉంటామని తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 40 మంది తమ వెంట ఉన్నారని అజిత్‌పవార్‌ చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య కంటే ఇది ఎక్కువే. తాము ఇక్కడ వ్యక్తులుగా లేమని, పార్టీగా ఉన్నామని చెప్పారు. తమ పార్టీ 24 ఏండ్లదని, యువ నాయకత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తొలుత పలువురు సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలతో అజిత్‌పవార్‌ మంతనాలు జరిపారు.

ఈ సమావేశంలో ఎన్సీపీ సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే కూడా ఉన్నారు. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వనందునే శరద్‌పవార్‌ మేనల్లుడు అలకబూనాడని, ఆ నేపథ్యంలో శిండే ప్రభుత్వంతో చేతులు కలిపారని అంటున్నారు. అలాగే అజిత్‌ పవార్‌ ట్విటర్‌ బయోను మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా మార్చారు.

పార్టీని చీల్చామనడం అవాస్తవం: ఛగన్‌ భుజ్‌బల్

తమ పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని ఎన్సీపీ నేత, మంత్రి ఛగన్‌ భుజ్‌బల్ అన్నారు. పార్టీని చీల్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాము ఎన్సీపీగా వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో తామూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశామని, కానీ ప్రస్తుతం దేశంలో మంచి పాలన ఉందన్నారు.

53 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మద్దతు మాకే: చంద్రశేఖర్‌

ఎన్పీపీకి చెందిన 53 మందిలో 40 మంది రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు తొమ్ముదులు..

మహారాష్ట్రలో 43 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉన్నది. బీజేపీ నుంచి 9 మంది, శివసేన శిండే వర్గం నుంచి 9 మంది మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఎన్సీపీ నుంచి కూడా 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరికను స్వాగతిస్తున్నానని. ఆయన చేరికతో మహారాష్ట్ర మరింత బలోపేతమవుతుందని సీఎం ఏక్‌నాథ్‌ శిండే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్నదని, అజిత్‌ చేరికతో అది త్రిబుల్ ఇంజిన్‌ సర్కార్‌గా మారిందని చెప్పారు.
రసవత్తరంగా మహా రాజకీయం కొంతకాలంగా మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

ఎన్సీపీలో చీలిక కోసం బీజేపీ యత్నిస్తున్నదని, పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాలు ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని శరద్‌పవార్‌ హెచ్చరించారు. ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరే అవకాశం ఉన్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నది. అయితే.. దీన్ని ఎన్సీపీ నేతలు కొట్టిపారేశారు. కానీ.. గురువారం ఏక్‌నాథ్‌ షిండే హస్తినలో బీజేపీ సీనియర్లను కలిసిన తర్వాత సీన్‌ మారింది. ఇవాళ ఉదయం నుంచి మహారాష్ట్రలో కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్‌ పవార్‌ సమావేశమయ్యారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 30 మంది అజిత్‌వైపు ఉన్నట్టు సమాచారం.

గతంలోనూ ఒక దఫా డిప్యూటీ

ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్‌పవార్‌ 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో జత కట్టారు. ఆ ఏడాది నవంబర్‌ 23న గవర్నర్‌ కార్యాలయంలో ఉదయాన్నే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌లు ప్రమాణస్వీకారం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది.

ఆ తర్వాత శివసేన, ఎన్పీపీ, కాంగ్రెస్‌ల మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. శివసేనలో చీలక తెచ్చి మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో విపక్ష కూటమి ఐక్యత ప్రయత్నాల్లో కీలకనేతలగా ఉన్న శరద్‌పవార్‌కు షాక్‌ ఇచ్చేలా ఎన్పీసీలో చీలక తెచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది వెన్నుపోటు

ఏక్‌నాథ్‌ శిండే ప్రభుత్వంలో చేరిన అజిత్‌పవార్ సహా 9 మందిపై చర్యలు తప్పవని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ చెప్పారు. తన నేతలే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వంతో చేతులు కలిపిన కొందరు నాతో మాట్లాడారు. బీజేపీ తమను ఆహ్వానించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని దశాబ్దం క్రితం కూడా ఎదుర్కొన్నాను. మళ్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్నాను. ఈసారి కూడా ఈ వెన్నుపోటును ఎదుర్కొనగలనన్న విశ్వాసం ఉన్నది’ అని శరద్‌పవార్‌ చెప్పారు.

అజిత్‌పవార్‌ తిరుగుబాటు అనంతరం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సహచరులు కొందరు భిన్న వైఖరి తీసుకున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించేందుకు, పార్టీలో కొన్ని మార్పులు చేసేందుకు జూలై 6న నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేశాను. కానీ.. ఆలోపే కొందరు భిన్న వైఖరి తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. శిండేతో వీరంతా ఎందుకు చేతులు కలిపారో కొద్ది రోజుల్లోనే ప్రజలకు అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

‘ఇటువంటి పరిస్థితులు నాకు కొత్త కాదు. 1980లో కూడా ఇలానే జరిగింది. అప్పట్లో మాకు 58 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. అందులో ఐదుగురు వెళ్లిపోయారు. నేను మళ్లీ పార్టీని పునర్నిర్మించాను. తదుపరి ఎన్నికల్లో వారందరినీ మేం ఓడించాం. నాకు ప్రజలపై నమ్మకం ఉన్నది. మరింత బలంగా ముందుకు వస్తాననే విశ్వాసం ఉన్నది’ అని ఆయన చెప్పారు.