విధాత: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో పాటు పలువురు నటీనటులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే సినీ ప్రముఖులందరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఆలియా భట్ మాత్రం మెరిసిపోయారు. అందమైన సిల్క్ ధర ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సిల్క్ చీరను ప్రత్యేక డిజైనర్ మాధుర్య డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా మాధుర్య హెడ్ భారతీ హరీశ్ మాట్లాడుతూ.. రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక వేళ ఆలియా భట్ మైసూర్ సిల్క్ శారీ ధరించిందని తెలిపారు. పల్లు డిజైన్ కోసం పది రోజుల పాటు కష్టపడి ప్రత్యేకండా డిజైన్ చేశామన్నారు. ఈ పల్లు వర్క్ మొత్తం చేతితోనే వేయబడిందని తెలిపారు. పల్లులో ప్రధానంగా రామాయణంలో ప్రస్తావించబడిన అంశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. రాముడు శివ ధనస్సును విరగ్గొట్టడం, వనవాసానికి వెళ్లే దృశ్యాలు, రామ సేతు, బంగారు జింక, హనుమంతుడు, సీత, రాముడి పట్టాభిషేకం వంటి దృశ్యాలను పల్లులో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
ఈ పల్లు డిజైన్‌కు 10 రోజుల పాటు 100 గంటల పాటు ఇద్దరు ఆర్టిస్టులు శ్రమించారు. ఇక ఈ చీరను ఆలియా భట్ రూ. 45 వేలు పెట్టి కొనుగోలు చేసింది. ఆలియా భట్ ధరించిన చీరపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.