మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను గురువారం నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలు
- మొత్తం అర్హులైన ఓటర్లు 1439 మంది
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ
- పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
- క్యాంపుల్లో అభ్యర్థుల మద్దతుదారులు
- గోవా బీచ్‌లలో ప్రజాప్రతినిధులు
- నేడు నేరుగా పోలింగ్ కేంద్రాలకు రాక
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను గురువారం నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం పది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును నియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. దీంతో తమ పార్టీవారిని కాపాడుకోవడం కోసం బీఆరెస్ నేతలు నానా అగచాట్లు పడుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వైపే అధికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు అధిక ఓట్లు వస్తాయని భావించిన ఆ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిని బరిలో నిలిపింది. ఇక్కడే బీఆర్ఎస్ ఆశలకు గండిపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ వైపు చూపు నిలిపారు. రోజు రోజుకూ కాంగ్రెస్‌కు మద్దతు పెరగడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి తప్పదనే ఉద్దేశంతో గులాబీ మద్దతుదారులను క్యాంపుల పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన మద్దతుదారులను భారీ ఎత్తున క్యాంపులకు తరలించింది. అయినా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం గులాబీ నేతల్లో ఉంది.
మునిసిపల్ వార్డు సభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వంటి స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులైన ఓటర్లను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డినే విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉంది.
గోవాలో విహారాలు
ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాలు స్థానిక ప్రజాప్రతినిధులకు వినోదాల విందుగా మారింది. ఇన్ని రోజులు గురుతుకురాని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని ఎర్ర తివాచీపై నడక సాగిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు గోవా సముద్రతీరంలో సరదాగా కాలం గడుపుతున్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో బార్లు, మసాజ్ కేంద్రాలు, బీచ్ లు పాలమూరు ప్రజాప్రతినిధులతో నిండిపోయాయని తెలుస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులకు ఈ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక్క ఓటు విలువ మూడు లక్షలకు పైగా చేరుతుందని లోలోన అభ్యర్థులు మథన పడుతున్నట్లు తెలుస్తోంది. బరిలోకి దిగాక తప్పదనే ధోరణిలో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడం లేదు. క్యాంపు నుంచి ప్రజాప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకులానే సౌకర్యం కల్పించారు.
ఇద్దరూ ఇద్దరే :
ఎన్నికలు అంటేనే డబ్బు… డబ్బు లేనిదే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదనే అభిప్రాయం అన్ని పార్టీల్లో ఉంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టే నాయకుల వైపే అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయనే ప్రచారం ఉన్నది. ప్రస్తుతం పాలమూరులో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక డబ్బుల మీదే నడుస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా డబ్బున్న నేతలు కావడడంతో ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయన షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో పేరున్న రియల్ వ్యాపారి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ యాజమాన్యంలో ఒకరు. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మన్నే జీవన్ రెడ్డి బాబాయి మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు.