Amith sha
విధాత : తెలంగాణలో అధికార పీఠంపై కన్నేసిన బీజేపి బహుముఖ వ్యూహాలతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేసిన క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కొంత వెనుకబడిన బీజేపి త్వరగా బలం పుంజుకునేందుకు కేంద్ర నాయకత్వం నేరుగా మార్గదర్శకం చేస్తుంది. జాతీయస్థాయిలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ ను, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థి బీఆరెస్ ను తెలంగాణలో అధికారంలోకి రాకుండా నిలువరించాలని బీజేపి పట్టుదలగా ఉంది. ఇందుకు ఏకంగా అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర బీజేపి నాయకులకు డైరెక్షన్ చేస్తుండడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఢిల్లీ కేంద్రంగానే బీజేపి తెలంగాణ వార్ రూమ్ పని చేస్తుందని, ఇకమీదట తెలంగాణ బీజేపీ వ్యూహాలన్ని ఢిల్లీ నుంచే అమలు చేయాలని అమిత్ షా ఖరారు చేశారనీ పార్టీ వర్గాల సమాచారం.
75 సీట్లు టార్గెట్..!
కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పార్టీ ముఖ్య నాయకులంతా అసెంబ్లీ బరిలోకి దిగాలని అమిత్ షా నిర్దేశించారని బీజేపి ఢిల్లీ వర్గాల కథనం.
బెంగాల్, త్రిపుర తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నాయకులంతా బరిలోకి దిగాల్సిందేననీ అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారని.. ముఖ్యంగా 75 సీట్లలో తక్షణమే గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని, వారి అభ్యర్థిత్వాలను ముందుగానే ఖరారు చేయాలని అమిత్ షా ఇప్పటికే కిషన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తుంది.
ప్రధానంగా బిజేపీ లో ఉన్న ముఖ్య నాయకులు 30 మంది అంతా కూడా అసెంబ్లీ బరిలోకి దిగాలని పార్టీ జాతీయ నాయకులు, ఎంపీలు అంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ బిజేపీ నాయకులు ఇకమీదట ఎవరు కూడా ఢిల్లీలో ఉండవద్దని, అంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల సంసిద్ధత పనుల్లో ఉండాలని అమిత్ షా గట్టిగా తెలంగాణ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
సామాజిక వర్గాల నేతలకు గాలం
అమిత్ షా తెలంగాణ రాజకీయ వ్యూహాలలో భాగంగా సాంప్రదాయ రాజకీయాల కంటే బెంగాల్ తరహా కొత్త తరహా రాజకీయ ఎత్తుగడలను అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే సామాజిక వర్గాలలోని బలమైన నేతలను గుర్తించి పార్టీలో చేర్పించడం, అవసరమైతే వారిని కూడా అసెంబ్లీ బరిలోకి దించాలని, వెంటనే అలాంటి సామాజిక వర్గం ముఖ్యులను, ఇతర పార్టీలలోని ప్రముఖ నాయకులను గుర్తించి పార్టీలో చేర్పించేలా చూడాలని తెలంగాణ బీజేపి నాయకులకు అమిత్ షా డైరెక్షన్ ఇచ్చారు. మొత్తం 75 సీట్లు టార్గెట్ గా గెలుపుగుర్రాలను ముందుగానే రంగంలోకి దించాలని, ఇందులో ఆలస్యం చేయరాదని ఆయన తెలంగాణ నాయకత్వాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు.
సుమారుగా 30 మంది వరకు బలమైన సామాజిక వర్గం నేతలను గుర్తించాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తుంది.
ఆ సీట్లలోనే పార్టీ ముఖ్య నేతల పోటీ .?
తెలంగాణ బీజేపి పార్టీ ముఖ్య నేతలు అంతా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలన్న అమిత్ షా ఆదేశాల మేరకు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాల కథనం మేరకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి, రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ స్థానం నుంచి, మరో ఎంపీ అరవింద్ ఆర్మూర్ లో, సోయం బాపూరావు బోథ్ లో పోటీ చేస్తారని భావిస్తున్నారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఢీకొట్టేందుకు ఇక్కడి నుండి ఈటెల రాజేందర్ పోటీకి కేంద్ర పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రఘునందన్ రావు తిరిగి దుబ్బాక నుంచి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో, మరో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేస్తారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాలలో, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ లేదా నారాయణపేటలో, విశ్వేశ్వర్ రెడ్డి తాండూరులో, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి లేదా ఇబ్రహీంపట్నంలో, మాజీ ఎంపీ వివేక్ చెన్నూరులో, విజయశాంతి మెదక్ లో, గరికపాటి మోహన్ రావు వరంగల్ జిల్లాలో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేత ఆచారి కల్వకుర్తిలో, ఇంద్రసేనారెడ్డి ఎల్బీనగర్లో, ఎన్వి ఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ లో, జాతీయ నేత మురళీధర్ రావు వేములవాడ లేదా కూకట్ పల్లిలో, రామచందర్రావు మల్కాజ్ గిరి లో, మహేశ్వర్ రెడ్డి నిర్మల్ లో, కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ లో, నందీశ్వర్ గౌడ్ పటాన్ చెరువులో, బాబు మోహన్ ఆందోల్ లో పోటీ చేయనున్నారు.
గోషామహల్ లో రాజాసింగ్ లేదా విక్రమ్ గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీలో కొత్తగా చేరిన సినీ నటి జయసుధ సికింద్రాబాద్ నుంచి, ఈటెల సతీమణి జమున హుజురాబాద్ లో పోటీ చేస్తారని తెలుస్తుంది. మాజీ ఎంపీలు రమేష్ రాథోడ్ ఆసిఫాబాద్ లో, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మంలో ఏదైనా స్థానంలో పోటీ చేయవచ్చని బిజేపి వర్గాల కథనం. త్వరలోనే పార్టీ ముఖ్య నేతల అభ్యర్థిత్వాలను ఖరారు చేసి ఎన్నికల ప్రచార దిశగా వారిని కార్యోన్ముఖులను చేయాలని బీజేపి కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది.