Nambi Narayanan Case | ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గూఢచర్యం కేసులో కుట్రపూరితంగా నారాయణన్‌ను ఇరికించారని నలుగురు నిందితులపై ఆరోపణలున్నాయి. వారికి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో పాటు, నిందితులకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను నాలుగు వారాల్లోగా మరోసారి పరిశీలించాలని కేరళ హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అదే సమయంలో ఐదు వారాల పాటు నిందితులను అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్ సహా నలుగురు నిందితులకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను సీబీఐ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కేరళ కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది.
1994 నాటి ఈ కేసు, నాడు దేశ వ్యాప్తంగా సంచలనాత్మకం అయ్యింది. నంబి నారాయణ్ ఇస్రో శాస్త్రవేత్తగా అనేక పరిశోధనలు చేశారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. 1994లో అవినీతి, గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. జైలుకు సైతం వెళ్లారు. రాకెట్లు, ఉపగ్రహాలకు సంబంధించిన (క్రయోజనిక్ ఇంజిన్ల తయారీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని) విదేశాలకు చేర వేశాడనే ఆరోపణలతో శాస్త్రవేత్త నంబినారాయణన్ అరెస్టు చేశారు.
సుదీర్ఘ కాలం జైలులో ఉన్న నారాయణన్ తాను నిర్దోషినని, అసలు విషయం మరేదో ఉన్నదని వాదిస్తూ వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ నారాయణన్‌పై గూఢచర్యం అభియోగం నిరాధారము, కుట్ర పూరితమైనదని తేల్చింది. అంతేకాకుండా.. క్రయోజనిక్ ఇంజిన్ల తయారీలో దశాబ్దాల పాటు జాప్యానికి కారకులైన పోలీసు అధికారులే నేరస్తులని, వారలా చేయటానికి విదేశీ హస్తమేదైనా ఉండవచ్చని సీబీఐ వాదించింది.
చాలా ఏళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆయనను నిర్ధోషిగా విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. నబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా ‘రాకెట్రీ’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆర్. మాధవన్ నిర్మించడంతో పాటు నంబి నారాయణ్ పాత్రను పోషించారు. ఆ తర్వాత నంబి నారాయణ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తగా ఆయన సాధించిన విజయాలు, ఎలా కుట్రలో ఇరుక్కున్నారనే విషయాలను చూపించగా.. సినీ విమర్శకులను మెప్పించింది.
ఈ నేపథ్యంలోంచే సుప్రీం కోర్టు తాజా తీర్పునిచ్చింది. ఏదేమైనా నిజాయితీ పుడైన నంబినారాయణన్ సచ్ఛీలుడుగా నిజాయితీ పరుడుగా నిగ్గుతేలటం హర్షణీయం. కుట్రపూరితంగా కేసులు పెట్టిన గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బీ. శ్రీకుమార్, విశ్రాంత నిఘా అధికారి పీఎస్ జయప్రకాశ్ మరో ఇద్దరు పోలీసు అధికారుల చర్యలే అనుమానించ దగినవి. ఇస్రో లాంటి సంస్థల కార్యకలాపాలనే పక్కదారి పట్టించటం, నిర్వీర్యం చేయటంలో పోలీసులే పాత్రధారులు కావటం దిగ్భ్రాంతి కరం.