నియామకపత్రాలు అందుకున్న వారిలో ఎవరికి ఎన్ని?

ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, జీవో 3 వల్ల మహిళలకు అన్యాయం జరుగుతున్నదని రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిక్షం నేతల మధ్య మాటల యుద్ధం

నియామకపత్రాలు అందుకున్న వారిలో ఎవరికి ఎన్ని?

విధాత: ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, జీవో 3 వల్ల మహిళలకు అన్యాయం జరుగుతున్నదని రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిక్షం నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. మహిళలకు అన్యాయం చేసే జీవో 3ను రద్దు చేయాలని కోరుతూ భారత జాగృతి చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ జీవోను రద్దు చేయాల్సిందేనని ధర్నా చౌక్‌ వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ జీవో వల్ల మహిళలకు తక్కువ ఉద్యోగాలు వచ్చాయని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. కవిత ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు. మహిళలను కాంగ్రెస్‌ నుంచి దూరం చేయడానికి కవిత జీవో నంబర్‌ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అసలు ఆ జీవో తెచ్చిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని, కాబట్టి ఆ పార్టీ తప్పుడు ప్రచారం మాని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

ఎన్నికల సమయం కాబట్టి వివిధ వర్గాల ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తాయి. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి ఉద్యోగ నియామకాల్లో హారిజంటల్‌ విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోర్టు కేసులతో ఆగిపోయిన నియామకాలకు వర్టికల్‌, హారిజంటల్‌ విధానం వల్ల మార్గం సుగమమైంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగిందా? వాళ్లు ఉద్యోగ నియామకాల్లో హక్కులు కోల్పోయారా? అన్న విషయాలను ‘విధాత’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ వర్గాల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నియామకపత్రాలు అందుకున్న కేటగిరి వారిగా Male/ Female వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వం ఉద్యోగార్థులకు అందించిన నియామకపత్రాల్లో వైద్య, ఆరోగ్య నియామకబోర్డు ద్వారా ఎంపికైన అభ్యర్థుల్లో 2024 జనవరి 31న 6,956 మంది ప్రభుత్వం నియామకపత్రాలు అందించింది. అందులో 6,133 (88 శాతం) మహిళలకు, 823 (12 శాతం) పురుషులకు కొలువులు దక్కాయి. ఫిబ్రవరి 14న ప్రభుత్వం పొలీస్‌ నియామకాల్లో ఎంపికైన 13,444 మందికి నియామకపత్రాలు అందించగా వారిలో 10,875 మంది (81 శాతం) పురుషులకు, 2,569 మంది (19 శాతం) మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి. సోషల్‌ వెల్ఫేర్‌ టీచర్స్‌, జేఎల్‌కు ఎంపికైన 1,997 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 15న ప్రభుత్వం నియామకపత్రాలు అందించింది. ఈ నియామకపత్రాలు అందుకున్నవాళ్లలో 1,189 (60 శాతం) మంది మహిళలు, 808 మంది( 40 శాతం) పురుషులు ఉన్నారు. ఈ విధంగా మార్చి 4వ తేదీ నాటికి వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన 22,397 మందికి ప్రభుత్వం నియామక పత్రాలు అందించింది. వాటిలో 12,506 మంది (56 శాతం) పురుషులు, 9,891 మంది (44 శాతం) మహిళలకు ఉద్యోగాలు లభించాయి. మార్చి4వ తేదీన సోషల్‌ వెల్ఫేర్‌ టీచర్స్‌, జేఎల్‌, టీఎస్‌పీఎస్సీద్వారా ఎంపికైన ఉద్యోగాలు నియామకపత్రాలు అందుకున్నారు. ఈ బోర్డుల ద్వారా మొత్తం 6,545 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందగా..వారిలో 2,865 మంది (44 శాతం) పురుషులు, 3,680 (56 శాతం) మంది మహిళలలు నియామక పత్రాలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన 2024 జనవరి 31 నుంచి మార్చి 4 నాటికి మొత్తం 28,942 నియామకపత్రాల్లో పురుషులకు 15,371 (53 శాతం), మహిళలకు 13,571 (47 శాతం) కొలువు దక్కినట్టు అంకెలు చెబుతున్నాయి.

మరి మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం దక్కడం లేదని, జీవో 3 వల్ల వారికి అన్యాయం జరుగుతున్నదనే వాదనలో వాస్తవమా? కాదా అన్నది ఈ అంకెలు చూస్తే అర్థమౌతుంది. నిరుద్యోగుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించాలి. వారి హక్కుల కోసం పోరాడాలి. కానీ వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా వారిని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సరికాదంటున్నారు.