విధాత: ఆంధ్రప్రదేశ్ లో సమ్మెలో ఉంటూ విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం ఉత్తర్వుల జారీతో అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్నారు. సోమవారం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చి.. ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విజయవాడ బాట పట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులను రంగంలోకి దింపింది. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. పలువురిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈపరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ఈక్రమంలో అంగన్వాడీలు విజయవాడకు తరలిరాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్ కు ఇచ్చేందుకు తరలిరావాలని ఇప్పటికే అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు సమాచారం. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలుచోట్ల బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి తీసుకుంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్టేషన్ పరిధిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా, వారు స్టేషన్లోనే నిరసనకు దిగారు.
నెల్లూరు జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలోని అంగన్వాడీల నిరసనలు కాక రేపుతున్నాయి. మచిలీపట్నం నుంచి చలో విజయవాడకు తరలివస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేసి కృష్ణా జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అక్రమంగా నిర్బంధించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలాఉండగా 42 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు, ఆయాలపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటల లోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. పలుచోట్ల సిబ్బందిని తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లను సిద్ధం చేస్తున్నట్లు సమచారం.
ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీలు, ఆయాలు 1734 మంది, పల్నాడు జిల్లాలో 1358 మందిని తొలగిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. కాగా టెర్మినేషన్ ఆర్డర్లపై గెజిట్ నోటిఫికేషన్ జారీకి ప్రయత్నం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రెండు, మూడు రోజుల్లో కొత్త అంగన్వాడీల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొండిపట్టు, అంగన్వాడీల సుధీర్ఘ సమ్మె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.