Rajasthan | అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ సయోధ్యకు కదిలిన కాంగ్రెస్‌

ఆ బాధ్యతను సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అప్పగింత కమల్‌నాథ్‌, కేసీ వేణుగోపాల్‌ తో కలిసి సచిన్‌లో చర్చలు బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే దీక్ష ఇది పార్టీకి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదని సచిన్‌ స్పష్టం విధాత‌: రాజస్థాన్‌ (Rajasthan) లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ ల మధ్య నెలకొన్నవిభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ చర్యలు చేప్టటింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు అప్పగించింది. […]

  • Publish Date - April 15, 2023 / 01:29 AM IST
  • ఆ బాధ్యతను సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అప్పగింత
  • కమల్‌నాథ్‌, కేసీ వేణుగోపాల్‌ తో కలిసి సచిన్‌లో చర్చలు
  • బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే దీక్ష
  • ఇది పార్టీకి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదని సచిన్‌ స్పష్టం

విధాత‌: రాజస్థాన్‌ (Rajasthan) లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ ల మధ్య నెలకొన్నవిభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ చర్యలు చేప్టటింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు అప్పగించింది. కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి సచిన్‌ పైలట్‌ నివాసానికి వెళ్లారు.

వసుంధరరాజే పాలనలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ చేసిన ఒక్క రోజు దీక్షతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. పార్టీకి ఇబ్బందులు తెచ్చే ఈ దీక్ష చేపట్టవద్దని ఏఐసీసీ హెచ్చరించినా పట్టించుకోకుండా సచిన్‌ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నేతల మధ్య విభేదాలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది.

ఈ సమస్యలను పరిష్కరించకపోతే అది అంతిమంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ల మధ్య విభేదాలు పరిష్కరించాలని నిర్ణయించి ఈ బాధ్యతను మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు అప్పగించింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కమల్‌నాథ్‌, మరో సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్ తో కలిసి పైలట్‌ నివాసానికి వెళ్లి చర్చించారు.

బీజేపీ పాలనపై జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోనందునే దీక్ష చేపట్టినట్టు మాజీ డిప్యూటీసీఎం సచిన్‌ పైలట్‌ చెప్పినట్టు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా దీక్ష చేపట్టలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎటువంటి సానుకూల ఫలితాలు రాలేదని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక నేత చెప్పారు.

సచిన్‌ పైలట్‌ వ్యవహారంపై రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ సుర్జిందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలతో సమావేశమై పరిస్థితులు వివరించినట్టు సమాచారం. వసుంధర నేతృత్వంలో ని బీజేపీ పాలనలో జరిగిన అవినీతి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే తాము దీక్ష చేపట్టినట్టు పార్టీ దూతలకు చెప్పారు. ఇది పార్టీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల్లో బసవరాజు బొమ్మై, అదానీ పై తమ పార్టీ చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే దీక్ష చేపట్టినట్టు సచిన్‌ తెలిపారు. పార్టీ క్రమశిక్షణ అంశానికి వస్తే గత ఏడాది గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకాదని పోటీ సమావేశం నిర్వహించడంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పైలట్‌ వర్గం ప్రశ్నిస్తున్నది. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్టు చెప్పిన పార్టీ వర్గాలు.. దీనిపై ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు.