విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ బడ్జెట్ సమావేశాలు 45 పనిదినాలు సాగేవి. సంవత్సర కాలం వ్యవధిలో అత్యధిక పనిదినాలు సభ నడిచేది బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనే. అలాంటి అతి ముఖ్యమైన సమావేశాలు తగ్గుతూ తగ్గుతూ ఏడు పనిదినాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించింది. ఈ విడత శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఏడు పనిదినాలు మాత్రమే కొనసాగాయి. మరికొన్ని రోజులు పొడిగించాలని విపక్ష సభ్యులైన కాంగ్రెస్, బీజేపీ చేసిన వినతులను ప్రభుత్వం పెడ చెవిన పెట్టేసి ఇవాళ ముగించేసింది.
బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్ష సభ్యులు అత్యధిక సమయం తీసుకోగా, ప్రతిపక్ష సభ్యులకు స్వల్ప సమయం మాత్రమే ఇచ్చారు. బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్ ప్రజా సమస్యలపై ప్రస్తావించిన పలు సందర్భాల్లో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు అడ్డు తగిలారు. మొత్తం ఏడు రోజుల సమావేశాల్లో ఏడెనిమిది ప్రశ్నలు మాత్రమే సంధించానని ఈటల చెప్పారు. కనీసం 45 రోజులు సభ జరపాల్సి ఉండేదని, ఇంత స్వల్ప సమయం సభ జరగడం నేనెప్పుడూ చూడలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మందబలంతో సభ నిర్వహించిందని, ప్రజలు అంతా గమనిస్తారన్నారు. కేసీఆర్ తన పేరును అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా పొంగిపోనని, తన చరిత్ర తెలిసిన వారు ఎవరూ కూడా తనను తక్కువ అంచనా వేయరని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‌లో సైనికుడిలా పనిచేశాను, బీజేపీలో కూడా సైనికుడిలా పనిచేస్తానని అన్నారు.
మా.. ఈటల రాజేందర్: CM KCR! 2 గంటల ప్రసంగంలో 12 సార్లు ప్రస్తావన
నా మీది చేసిన దాడిని ఎన్నడూ మరిచిపోనని, మెడలు పెట్టి గెంటేసిన బీఆర్ఎస్ వాళ్లు పిలిచినా వెళ్లనని స్పష్టం చేశారు. నేను పార్టీ మారలేదు, వాళ్లే గెంటేశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నా, నగరంలో పట్ట పగలే హత్యలు జరుగుతున్నాయని ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఆరోగ్య శ్రీని కొనసాగించాలని, హాస్పిటళ్లకు చెల్లిస్తున్న ఛార్జీలను సవరించాలని కోరారు.
కరెంటు కోతల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, కాపాడండి మహాప్రభో అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, 4 గంటలకు మించి రైతులకు కరెంటు ఇవ్వడం లేదన్నారు. రైతు సమస్యలపై గొంతు చించుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టాలిచ్చేందుకు సిఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.5 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలిస్తామని, అడవిని రక్షిస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఇకపై పోడు పేరుతో ఆక్రమణలు ఉండవద్దని, మళ్లీ ఆక్రమణలకు పాల్పడితే హక్కులు రద్దు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఎస్టీ జాబితాలో 11 కులాలను చేర్చుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వాల్మీకి బోయ, ఖాయితీ లంబాడతో పాటు మరో 9 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ సిఎం స్వయంగా సభలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపనున్నారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)తో దరఖాస్తులు పెట్టి, సమాచారం సేకరించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన బ్లాక్ మెయిలర్ పీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అని మున్సిపల్ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ధరణి ఫోర్టల్ పై జరిగిన చర్చలో మంత్రి రామారావు మాట్లాడుతూ, హైదరాబాద్, రంగారెడ్డి భూములపై ప్రత్యేకంగా దప్తర్ (దుకాణం) పెట్టుకుని దందాలు చేస్తున్నారన్నారు. ప్రగతి భవన్‌ను బాంబులతో బద్దలు కొడతానని హెచ్చరిస్తున్నాడని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని చేసిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేయగా, మా పార్టీ విధానం అదేనని సభలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1.27 లక్షల కోట్లు రావాల్సి ఉందని, వాటిని వసూలు చేసేందుకు అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు చేతనైతే నిధులు ఇప్పించాలని, ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నా ఆయన నా మిత్రుడేనన్నారు.
సీఎం తన ప్రత్యేక నిధికి అమాంతం డబ్బులు పెంచారు. జిల్లాల పర్యటన వెళ్లిన సందర్భంలో చేతికి ఎముక లేకుండా డబ్బులు ఇచ్చేందుకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లో ఎస్.డి.ఎఫ్ కు రూ.2వేల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.10,348 కోట్లు పద్దులో పెట్టారు. సీఎం జిల్లా పర్యటించిన సందర్భంగా ఇచ్చిన వరంపై అదే రోజు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేయనున్నది.
ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెవెన్యూ వసూళ్లు రూ.2,16,566 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.4,881 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ రూ.2,90,396 కోట్లు. అయితే కొత్త పథకాల ఊసే లేకుండా పోయింది. గిరిజన బంధు పై ప్రస్తావన లేదు, డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదు. మన ఊరు మన బడి ఎక్కడికి పోయిందో తెలియదు. రైతు రుణ మాఫీకి రూ.20వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా, కేటయించింది రూ.6,385 కోట్లు మాత్రమే.
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు లేకున్నా, వచ్చినట్లుగా భారీ అంచనాతో లెక్కలు వేశారు. రెవెన్యూ రాబడులపై అంకెల గారడి తప్ప ఏమి లేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రచార, ప్రసార సాధనాల్లో ప్రభుత్వ పథకాలను ఊదరగొట్టేందుకు రూ.1 వేయి కోట్లు బడ్జెట్‌లో కేటాయించుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం అప్పులు రూ.4.86 లక్షల కోట్లు కాగా ఒక్కో వ్యక్తిపై అప్పుల భారం రూ.1,28,992.
తెలంగాణ శాసనసభ జరిగిన విధానం ఇది..
8 రోజులు, 56 గంటలు
38 ప్రశ్నలు, 21 పద్దుల, 5 బిల్లుల ఆమోదం
వారం రోజుల పాటు సాగిన శాసనసభ 4వ మీటింగ్ 8వ సెషన్
38 స్టార్డ్ క్వశ్చన్స్ కు మౌఖిక సమాధానాలు ఇచ్చిన ప్రభుత్వం
మొత్తం 56 గంటల 25 నిమిషాల పాటు సాగిన పని గంటలు
12 ప్రశ్నల సమాధానాలను టేబుల్ చేసిన ప్రభుత్వం
సభలో 41 మంది సభ్యుల ప్రసంగాలు జరుగగా, శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది