మ‌ణిపూర్ పోలీస్‌ కార్యాలయంపై సాయుధుల దాడి

మణిపూర్‌లో వ‌రుస‌గా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి

  • Publish Date - January 18, 2024 / 09:54 AM IST
  • ముగ్గురు బీఎస్ఎఫ్‌ సిబ్బందికి గాయాలు
  • ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన
  • కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే మూక హింస‌

విధాత‌: మణిపూర్‌లో వ‌రుస‌గా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బుధ‌వారం రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై భారీ గుంపు దాడి చేయ‌డంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) సిబ్బంది గాయపడ్డారు. తౌబాల్‌కు సుమారు వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మోరే సరిహద్దులో ఇద్దరు కమాండోలు మరణించిన కొన్ని గంటల తర్వాత సాయుధ మిలిటెంట్లు పోలీసు బృందంపై దాడి చేయడంతో మూక హింస జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తౌబాల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్‌పై సామూహికంగా దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. తౌబాల్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి తెబడ్డారని, సాయుధులైన కొందరులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. వారిని ఇంఫాల్‌లోని దవాఖానకు తరలించామని వెల్లడించారు.

బుధవారం సాయంత్రం తెంగ్నోపాల్‌ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేసిన ఈ దాడిలో ఇద్దరు పోలీస్‌ కమెండోలు మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు బాంబులతో దాడి చేసి కాల్పులు జరపడమే కాక ఆర్పీజీ షెల్స్‌ ప్రయోగించారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. జాతి ఘర్షణల మధ్య, భద్రతా వ్యవస్థల నుంచి ఆయుధాలు దోచుకెళ్లారు. తీవ్రవాదులు లూటీచేసిన ఆయుధాల‌తో హింసకు ఆజ్యం పోస్తున్నారు.