భువనేశ్వర్ : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం నేపథ్యంలో రామ భక్తులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో భక్తుడు ఒక్కో రకంగా శ్రీరాముడి పట్ల తమ భక్తి చాటుకుంటున్నారు. ఒడిశాకు చెందిన శిల్పి శాశ్వత్ రంజన్ అయోధ్యలోని రామమందిరం ప్రతిరూపాన్ని తయారు చేశారు. 936 అగ్గిపుల్లలతో ఈ ప్రాజెక్టును రంజన్ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా శాశ్వత్ రంజన్ మాట్లాడుతూ.. అగ్గిపుల్లలతో రామ మందిరం ప్రతిరూపాన్ని తయారు చేసి రామభక్తిని చాటుకున్నానని తెలిపారు. ఈ ప్రతిరూపాన్ని తయారు చేసేందుకు 936 అగ్గిపుల్లలు వినియోగించానని, ఆరు రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఈ రామ మందిరాన్ని 14 ఇంచుల పొడవు, ఏడు ఇంచుల వెడల్పులో నిర్మించినట్లు తెలిపారు. అసలు అగ్గిపుల్లలతో రామమందిరం ప్రతిరూపం నిర్మాణం చేస్తానని అనుకోలేదు. అలా మొదలుపెట్టి.. పూర్తి చేశానని రంజన్ చెప్పారు. ఈ ప్రతిరూపాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. దీనికి ఎవరైనా సహాయం చేయాలని రంజన్ విజ్ఞప్తి చేశారు.