విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ ఎంపీ బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మెజిస్ట్రేట్ ముందు ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తారా లేదా మంజూరు చేస్తారా అని ఉత్కంఠత నెలకొంది.
14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి 8:15 గంటల వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్టకేలకు తీర్పు ఇచ్చారు.
టెన్త్ పేపర్ లీక్ కు ప్రధాన కారకుడిగా పేర్కొంటూ బండి సంజయ్ ను ఏ1గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు హన్మకొండ కోర్టు ఆవరణలో ఉన్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నివాసానికి బుధవారం సాయంత్రం బండి సంజయ్‌ను తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు సంజయ్ ని హాజరు పరిచారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని తెలిపారు.
బండి సంజయ్ పై పై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్‌ప్రాప్రాక్టీస్, సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన సంజయ్ రిమాండ్ రిపోర్టు పై వాదోపవాదాలు జరిగాయి. బిజెపి లీగల్ టీం ప్రతినిధులు తమ వాదనలను వినిపించారు. వాదనలు విన్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పును ప్రకటించారు.
ముందుగా పోలీసుల దురుసు ప్రవర్తనతో తనకు తగిలిన గాయాలను షర్ట్ విప్పి న్యాయవాదులకు బండి సంజయ్ చూపించారు. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్ చేసిన తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు సంజయ్ వివరించారు.
హన్మకొండ కోర్టు మెజిస్ట్రేట్ నివాసం వద్దకు బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు
సంజయ్‌ను చూడగానే జై బీజేపీ, జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. వ్యూ వాంట్ జస్టిస్ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినదించారు.
వారిని చూసి పోలీస్ వాహనంలో నుండి దిగుతూ బండి సంజయ్ నవ్వుతూ కార్యకర్తలకు, అభిమానులకు, అభివాదం తెలుపుతూ పోలీసులతో కలిసి మెజిస్ట్రేట్ నివాసంలోకి వెళ్ళారు.