అహంకారంతోనే సీఎంపై బీఆరెస్ నేతల అనుచిత వ్యాఖ్యలు
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని చెప్పుతో కొడతానని బీఆరెస్ నేతలు మాట్లాడడం సమంజసం కాదని ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు

- శాసన సభను పరస్పర విమర్శల వేదికగా మార్చకండి
- లోక్‌సభ ఎన్నికల్లోగానే హామీలను అమలు చేయాలి
- ఈటలతో విభేదాలు వట్టిమాటే
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్ : సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని చెప్పుతో కొడతానని బీఆరెస్ నేతలు మాట్లాడడం సమంజసం కాదని, సీఎం పదవికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం అందరిపైనా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీఆరెస్ పార్టీ అహంకారపూరిత వైఖరికి ఇట్లాంటి మాటలే నిదర్శనమన్నారు. గావ్ చలో అభియాన్ లో భాగంగా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో బస చేసిన బండి సంజయ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రజలు కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల డైవర్ట్ పొలిటిక్స్‌ను గమనించాలని కోరారు. కొందరు నేతలు హద్దు మీరి అసభ్యంగా మాట్లాడుతున్నరని, రాజకీయాలకు ఇది ఏమాత్రం తగదన్నారు. రెండు పార్టీల నేతలు ఒకరికొకరు తిట్టుకోవాలని, కొట్టుకోవాలని అనుకుంటే… పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాట్లు చేస్తామని, అక్కడ ఎవరేమిటో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టుకుంటూ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీని పరస్పర ఆరోపణల వేదికగా మార్చవద్దు
అసెంబ్లీ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే ప్రజలకు ఏం లాభమని ప్రజల సమస్యలపై చర్చించేది ఎవరని, వాళ్లకు ఇచ్చిన హామీలను అమలు చేసే దెవరని బండి ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలను ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విధంగా నిర్వహించాలని, బీఆరెస్, కాంగ్రెస్ పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లకు దానిని వేదికగా మార్చవద్దన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గరున్న ప్రణాళిక ఏమిటో ప్రజల ముందుంచాలన్నారు. రాష్టం ఆర్దిక పరిస్థితి బాగోలేదని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని అంటున్న సీఎం, మంత్రులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో అసెంబ్లీ వేదికగా తెలంగాణ సమాజం ముందు ఉంచాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ లోగా హామీలు అమలు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈనెలలోనే ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని, ఈలోగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరాలన్నారు. షెడ్యూల్ వచ్చేదాకా సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేస్తూ వచ్చి, ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎకరానికి రూ.15 వేల రైతు బంధు హామీతో పాటు,మహిళలకు రూ.2,500 జీవన భృతి, రూ.4 వేల పెన్షన్, గృహవసతి లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల సాయం, రూ. 2 లక్షల రుణమాఫీ హామీలను అమలు చేయాల్సిందే అన్నారు.
పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్ కొత్తగా ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం పది లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పేదల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల వ్యవధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లుల మాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను వారికి వర్తింప చేయాలన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకునేందుకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఉద్యోగులకు ప్రతిబంధకంగా ఉన్న 317 జీవోను సవరించాలని సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీలో తనకు ఈటల రాజేందర్‌తో సహా ఎవరితోనూ విబేధాల్లేవని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడమే తప్ప మరో ఆలోచనకు తావిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈటల సీనియర్,అనుభవమున్న నేత కాబట్టే శాసనసభ ఎన్నికల సందర్భంలో తాను హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు.