విధాత, వనపర్తి బ్యూరో: బర్రెలక్క అలియాస్ శిరీష మూడు ముల్ల బంధంతో ఓ ఇంటి రాలైంది. ఆమె పెళ్ళి నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కేంద్రంలోని పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం వైభవంగా జరిగింది. బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానుల సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లా పెద్దపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌తో బర్రెలక్క వివాహం చూడ ముచ్చటగా జరిగింది. నిరుద్యోగుల తరుపున గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆరెస్ పార్టీకి వ్యతిరేకంగా బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుత్సాహానికి గురైన బర్రెలక్క అలియాస్ శిరీష బర్రెలను కొనుగోలు చేసి బర్రెల కాపరిగా మారిందని, ప్రభుత్వాల వైఫల్యం మూలంగానే నిరుద్యోగిత పెరుగుతున్నదని గత ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. నిరుద్యోగుల పక్షాన ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తన పేరు సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనంగా మారుమోగింది.