Bhatti Vikramarka | గుత్తా, జగదీష్ రెడ్డిలపై భ‌ట్టి మళ్లీ ఫైర్

Bhatti Vikramarka విధాత: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నా కోసమో, ఓట్ల కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేయడం లేదని ఈ పాదయాత్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నదని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నాగార్జునసాగర్ నియోజక వర్గంలో గుర్రంపోడు మండల కేంద్రంకు చేరుకున్న సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలు సకలజనుల సమ్మెలకు చలించిన సోనియమ్మకు పార్లమెంట్ లో బలం […]

Bhatti Vikramarka | గుత్తా, జగదీష్ రెడ్డిలపై భ‌ట్టి మళ్లీ ఫైర్

Bhatti Vikramarka

విధాత: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నా కోసమో, ఓట్ల కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేయడం లేదని ఈ పాదయాత్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నదని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నాగార్జునసాగర్ నియోజక వర్గంలో గుర్రంపోడు మండల కేంద్రంకు చేరుకున్న సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థుల బలిదానాలు సకలజనుల సమ్మెలకు చలించిన సోనియమ్మకు పార్లమెంట్ లో బలం లేకపోయినా అందర్నీ ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇచ్చారన్నరు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం, నిధులు కోసం, నియామకాల కోసమని,దళిత, బహుజన మైనార్టీలకు, చిన్న, సన్నకారు రైతులు తలెత్తకుకుని ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియాకమాలు ఏమీ రాలేదని, వనరులు, సంపద, భూమి ప్రజలకు పంచబడలేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, ప్రశ్నిస్తే పోలీసుల కేసులని, రాష్ట్ర ప్రజలు పోలీసులు పడగనీడలో భయంభయంగా బతుకున్నారన్నారు.

ఆదిలాబాద్ నుంచి గుర్రంపోడు వరకూ వేలాది కిలోమీటర్లు మార్గమధ్యంలో ప్రజలంతా చెబుతున్న మాట ఇదేనన్నారు. తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరకుండా అడ్డంగా నిబడ్డ కేసీఆర్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఎత్తి బంగాళాఖాతంలో కలిపేస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు, పేదవాళ్లకు ఇచ్చే పింఛన్లు ఆగిపోయాయయని, ఇచ్చే పింఛన్ లో భార్యాభర్తల్లో ఒకరికి కోసేసి ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రతి ఏడాది ఇవ్వాల్సిన డీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు నిలిచిపోయాయాయని, ఇవన్నీ చూసిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణ ఇచ్చిన లక్ష్యాలు నెరవేరే వరకూ మమ్మల్ని ప్రజల్లో ఉండమని చెబితే పాదయాత్రగా వచ్చామన్నారు. ఎండల్లో, వానల్లో సైతం నడుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

ఇక్కడకు వచ్చేముందు అచ్చంపేట వద్ద నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను ప్రారంభించారని, దానిని చుశామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ టన్నెల్ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుక పడలేదన్నారు.

నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డంగా నిలబడ్డ ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజా ప్రతినిధులను నేను అక్కడే ప్రశ్నించానన్నారు. ఈ ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తి చేయకుండా పదేళ్లుగా మొద్దు నిద్ర పోతోందని, కొత్తగా ఒక్క చుక్క నీళ్లు తీసుకురాని ఇక్కడి మంత్రి గాడిదలు కాస్తున్నారా?? అని అడిగానన్నారు.

దానికి వాళ్లిచ్చిన సమాధానం నాగార్జున సాగర్ కాలువల నుంచి నీళ్లుస్తున్నామని చెప్పారని, అది లష్కర్ లు చేసేపని మంత్రి చేస్తున్నాడా? అని అడిగితే సమాధానం లేదన్నారు. ఇంతకూ ఈయన మంత్రా?? లేక లష్కరా?? అని మరోసారి భట్టి ఎద్దేవా చేశారు.

నల్లగొండ ప్రజలకు నీళ్లు రాలేదుకానీ.. బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయని, వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, వాళ్ల కుటుంబ ఆస్తులు పెరిగాయని, వాళ్ల కుటుంబాలు మాత్రం బంగారమైనాయన్నారు. కానీ తెలంగాణలోని సామాన్య ప్రజలెవరకీ ఈ ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదని, ఈ ప్రాంతంలో కొత్తగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదన్నారు.

మంత్రులుగా ఉండి.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడం ద్వారానో, డిండి లిప్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఏమైనా పారించి ఉంటే చెప్పాలని అడిగితే.. సమాధానం చెప్పే ధైర్యం బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఇప్పటికీ డిండికి నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకురావాలా?? లేక మరోచోట నుంచి తీసుకురావాలా అన్న మీమాంసలో పదేళ్లుగా దున్నపోతులా ఈ ప్రభుతం నిద్రపోతే.. నల్లగొండ జిల్లా వాసులను భూములను ఎండబెడ్తున్నారన్నారు.

దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి చెబుతున్నాడని, ప్రతి గ్రామ పంచాయితీకి 20 వేలు ఇస్తామని చెబుతున్నారని, ఏ ఒక్క కాలువ తవ్వించారని పండుగ చేసుకోవాలి? ఏ ప్రాజెక్టు కట్టించి నీళ్లు పారించారని పండగ చేసుకోవాలని ప్రశ్నిస్తున్నానన్నారు.

అసలు పండగ చేసుకోవాలంటే.. నాగార్జున సాగర్ లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి.. కాలువలు తవ్వించి.. భూములకు నీళ్లు పారించి పంటలు పండేలా చేసి.. నాలుగు ముద్దలు తినేందుకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ నాయకులను గుర్తు చేసుకుని అసలైన పండగ చేసుకోవాలని తాను పిలిపిస్తున్నానన్నారు.

ఈ జిల్లాకు నీళ్లు రాకుండా, ఈ ప్రజలకు ఏమీ చేయకుండా.. మీరు మీ కుటుంబ సభ్యలు ఆస్తులు పెంచుకోవడం కోసమో, లేక ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి.. పోలీస్ స్టేషన్ లో ఉంచినందుకో ఈ రోజు పండగ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ జిల్లానుంచి చాలా ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నాడని, గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదలైందని, ఈ పదేళ్లుగా ఆ టన్నెల్ పురోగతి గురించి, నిధులు గురించి కనీసం మీరు ఇప్పుడున్న పార్టీలో ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఏనాడైనా అడిగారా? అంటే సమాధానం లేదన్నారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ప్రశ్నిస్తే అప్పుడెప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏఎమ్మార్ ప్రాజెక్టు విషయంలో రాజీనామా చేస్తానని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించినట్లు చెబుతున్నాడని, దీనికి నేను ఒక్కటే అడుగుతున్నా.. అప్పుడు చంద్రబాబును బెదిరించినట్లే ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టులకు నిధుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికెళ్లి ఎప్పుడైనా అడిగావా?? అంటూ గుత్తాను ప్రశ్నించారు.

ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు రాక.. నీళ్లురాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికెళ్లి.. ఎందుకు అడగడం లేదని, రాజీనామా కాగితాన్ని కేసీఆర్ దగ్గర ఎందుకు పడేయ్యడం లేదని నేను ప్రశ్నిస్తున్నానంటు భట్టి మరోసారి గుత్తాను నిలదీశారు.

ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని తెలంగాణ ఇస్తే.. మీ జీవితాల్లో మాత్రం అధ్బుతమైన మార్పు వచ్చిందని, వందల ఎకరాల్లో అధ్బుతమైన ఫామ్ హౌస్ లు వచ్చాయని, ఒక్కొకరికి వేల కోట్ల రూపాయాల కాంట్రాక్టుల వచ్చాయని, వేల కోట్ల రూపాయాల ఆస్తులు మీ కుటుంబాలకు పెరిగిపోయాయన్నారు.

దారిపొడుగునా నడుచుకుంటూ వస్తుండగా ఆ సమయంలో మా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇదిగో ఇక్కడ 60 నుంచి 70 ఎకరాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని, మీరు నడుస్తున్న రోడ్డులో గుంతలు చూసుకుంటూ జాగ్రత్తగా అడుగుస్తున్నారని, అదే అక్కడ ఫామ్ హౌస్ కు డబుల్ రోడ్ ను అద్భుతంగా వేసుకున్నారని చూపించాడని.. ఇదేనా బిఆర్ఎస్ నాయకులు చేసుకున్న అభివృద్ధి అంటూ భట్టి ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డ వెంకట్ రెడ్డిలాంటి నాయకులు మంత్రులుగా వాళ్లేమీ చేయలేదని చెబుతున్న బిఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలన్నారు. మా నాయకులు అనేక సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్నారని, వీళ్లెవరికి పట్టుమని ఒక్క ఇల్లు కూడా సరిగ్గా లేదని, అక్కడక్కడా కిరాయి ఇండ్లలో ఉంటున్నారని, వారేవరికీ విచ్చలవిడిగా ఫామ్ హౌస్ లు లేవన్నారు.

రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి, చకిలం శ్రీనివాస రావు, పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి మహామహులు ఎందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం మహించారన్నారు..
సాయుధ రైతాంగ పోరాటానికి నాయత్వం వహించారన్నారు. దున్నేవాడిదే భూమి అని భూములు పంచిన పెద్దలున్నారన్నారు. గతంలో రవీంద్ర నాయక్, చౌహాన్, రాగ్యా నాయక్, పాపయ్య యాదవ్, రాజారత్నం, కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్లంతా ఈ జిల్లానుంచి ప్రాతినిథ్యం వహించి ప్రజల కోసం తపించారన్నారు.

కానీ ఈ తొమ్మిదేళ్లుగా మరో రకమైన నాయకులు ఈ జిల్లాలో పుట్టారని, జీవితం మొత్తం తెలంగాణ ప్రజల కోసమే అంకితమైనట్లుగా చెప్పుకుని మంత్రి అయిన జగదీష్ రెడ్డి, సుఖేందర్ రెడ్డిలు మీ రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు మీ ఆస్తులెంత? ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నిరెట్లు ఎలా పెరిగాయంటు భట్టి నిలదీశారు. ప్రజల జీవితాలు ఎదగాలి కానీ.. పాలకుల జీవితాలు కానేకాదన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కొత్త సంస్క్రుతి ఏర్పడిందని, వీళ్ల నాయకుడికి హైదరాబాద్ లో పెద్ద ఫామ్ హౌస్ గడి.. అందులోంచి కేసీఆర్ బయటకు రాడు.. ఆయన్ను చూసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు.. చుట్టూ పెద్ద గడి కట్టుకున్నారన్నారు.

ఈ గుర్రంపోడు చెట్టుకింద నిలబడి మంత్రి జగదీష్ రెడ్డిని, గుత్తా సుఖేందర్ రెడ్డిని నేను అడుగుతున్నానని, ఎందుకు కృష్ణా నది నీళ్లను ఈ నల్లగొండ జిల్లాకు రాకుండా అడ్డుపడ్డారన్నారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని, ఒక్కరికి కూడా ప్రభుత్వం ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని, ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పిన దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నానన్నారు. వీటికి సమాధానం చెప్పి.. ఆనాటి కాంగ్రెస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నానన్నారు.

మీలాగ మేము ప్రజాక్షేమం కోసం పనిచేయలేదని,మీలాగ మేయు ప్రజాసేవ చేయలేకపోయామని, మీరు చూపిన మార్గంలో మేము నడవలేకపోయామని కాంగ్రెస్ నేతలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకురాసి జగదీష్ రెడ్డి, గుత్తాలు నల్లగొండ జిల్లాను వదిలేసి బయటకు పోవాలన్నారు.

తెచ్చుకున్న తెలంగాణ సంపద ప్రజలకే చెందాలని, తెచ్చుకున్న రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు మనకు రావాలన్నారు.

ఈ కార్నర్ మీటింగ్‌లో డీసీసీ శంకర్ నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చలమల్ల క్రిష్ణారెడ్డి, చలమల్ల రాఘవరెడ్డి, కంఠం జగదీశ్ రడ్డి, చలమల్ల జగదీశ్వర్ రెడ్డి, గణేష్ నాయక్, సర్వయ్య, వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయారణ యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు.