కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా.. రైతుబీమా ప‌థ‌కం కూడా వ‌ర్తింపు

తెలంగాణ‌లోని కౌలు రైతుల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క.

కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా.. రైతుబీమా ప‌థ‌కం కూడా వ‌ర్తింపు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని కౌలు రైతుల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా సాయాన్ని ఇవ్వ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేస్తున్నామ‌ని శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. రైతుబంధు నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్ష చేసి నిజ‌మైన అర్హుల‌కు రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ. 15 వేలు అందించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌ని తెలిపారు.


అదే విధంగా ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ భీమా యోజ‌న కార్య‌క్ర‌మాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంట‌ల భీమా ప‌థ‌కాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రైతుబీమా ప‌థ‌కాన్ని కౌలు రైతుల‌కు కూడా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అందుకు అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్నామ‌ని విక్ర‌మార్క‌ చెప్పారు.


గ‌త ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కం పేరుతో అస‌లు రైతుల క‌న్నా పెట్టుబ‌డిదారులు, అన‌ర్హులకే ఎక్కువ లాభం చేకూర్చింద‌న్నారు. సాగు చేయ‌ని, ప‌నికిరాని కొండ‌లు, గుట్ట‌లు, అఖ‌రికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు ఇచ్చారు. పెట్టుబ‌డిదారులు, బ‌డా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎక‌రాల‌కు కూడా రైతుబంధు సాయం అందింది. ఇది అక్ర‌మం. ఈ రైతు నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్ష చేసి నిజ‌మైన అర్హుల‌కు రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ. 15 వేలు అందించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌న్నారు.


నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దు. నాణ్య‌మైన విత్త‌న ఉత్ప‌త్తి విష‌యాల్లో పురోభివృద్ధి సాధించేందుకు స‌క‌ల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఈ మేర‌కు త్వ‌ర‌లో ఒక నూత‌న విత్త‌న విధానం తీసుకురాబోతున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.