ఆపాయాన్ని ఉపాయంతో..!
మనకు ఎదురయ్యే అపాయాలను ఉపాయంతో తప్పించుకోవాలంటారు పెద్దలు. సరిగ్గా అలాగే తప్పించుకున్నాడు

- కిడ్నాపర్ల చెర నుంచి తృటిలో
- తప్పించుకున్న బీహార్ ప్రభుత్వ అధికారి
- కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో
- అదృష్టవశాత్తు తప్పించుకున్న బాధితుడు
- కారు స్వాధీనం.. నిందితుల కోసం గాలింపు
విధాత: మనకు ఎదురయ్యే అపాయాలను ఉపాయంతో తప్పించుకోవాలంటారు పెద్దలు. సరిగ్గా అలాగే తప్పించుకున్నాడు. బీహార్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. సీనియర్ అధికారిని శనివారం అర్థరాత్రి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వాహనంపై కిడ్నాపర్ నియంత్రణ కోల్పోవడంతో కారు కాల్వలోకి దూసుకెళ్లింది. దానిని అవకాశంగా తీసుకొని అధికారి తప్పించుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. వైశాలి జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ కార్యక్రమ సమన్వయకర్త ఉదయ్ కుమార్ ఉజ్వల్ శనివారం రాత్రి హాజీపూర్ నుంచి పాట్నాలోని తన ఇంటికి కారులో వెళ్తున్నారు. సోనేపూర్ సమీపంలోని హాజీపూర్-ఛప్రా హైవేపై బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కారును ఆపారు. వారు డ్రైవర్‌ను కొట్టి, వాహనం నుంచి బయటకు విసిరి, అధికారిని కిడ్నాప్‌చేసి అతడి కారులోనే తీసుకెళ్లారు. అధికారిని విడిచిపెట్టాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని కుటుంబసభ్యులకు ఫోన్‌లో డిమాండ్‌చేశారు.
కారులో వెళ్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. అధికారి ఏటీఎం పిన్ నంబర్ అడిగారు. ఖాతా నుంచి ఖర్చుల నిమిత్తం డబ్బులు డ్రా చేసుకోవచ్చని భావించారు. రెండు గంటలపాటు కారులోనే అధికారిని తిప్పారు. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అదే అదనుగా భావించి అధికారి వారి చెర నుంచి తప్పించుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.