నీళ్లు తాగి.. రోడ్లపై పడుకోమంటరా?.. మంత్రి గంగులకు చేదు అనుభవం

– రేషన్ కార్డ్ ఎవరికైనా ఇప్పించారా?
– ఐదేండ్లకోసారి వచ్చి ఓట్లడుగుడు మాత్రం తెలుసు
– మద్దులపల్లిలో నిలదీసిన మహిళలు
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం మద్దులపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు మహిళలు చుక్కలు చూపించారు. ప్రచారంలో భాగంగా మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన కమలాకర్ స్థానికుల నుండి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ‘ఐదేళ్లకు ఓసారి వస్తడు.. ఓటేయమంటడు.. మా గ్రామానికి చేసిందేమిటో చెప్పాల’ అని నిలదీశారు. ‘గ్రామంలో రోడ్లు వేశామని, మంచినీటి సౌకర్యం కల్పించామని చెప్పుకుంటున్నారు… మమ్మల్ని నీళ్లు తాగి రోడ్లపై పడుకొని బతకమంటారా…’ అని సూటిగా ప్రశ్నించారు.
కనీసం ఒక్కరికైనా రేషన్ కార్డు మంజూరు చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఈయన చేసిందేమిటో.. మీడియా ముందు మేమే మాట్లాడతాం’ అన్నారు. ప్రచారంలో మహిళలు తమ పార్టీ అభ్యర్థి గంగులను నిలదీయడంతో కొందరు స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోయారు. జరిగిన ఘటనలను చిత్రీకరిస్తే మర్యాదగా ఉండదని, కెమెరాలు పగలగొడతామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు నిలదీయడంతో, వారికి సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడి నుండి వెళ్లిపోయారు.