Bihar | బీహార్‌లోనూ బీజేపీ చిచ్చు?

Bihar జేడీయూలో తిరుగుబాటు ఖాయం తొక్కిసలాట జరిగే పరిస్థితులున్నాయి బీజేపీ నేత సుశీకుమార్‌ మోదీ వ్యాఖ్యలు చాలామంది టచ్‌లో ఉన్నారని వెల్లడి పాట్నా: మహారాష్ట్రలో తాజాగా అనుసరించిన తన సహజ పన్నాగాలనే బీహార్‌లోనూ అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యాఖ్యలు గమనిస్తే.. దాల్ మే కుచ్‌ కాలా హై అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ‘బీహార్‌లో కూడా త్వరలోనే తిరుగుబాటు వస్తుంది’ అని చెందిన సీనియర్‌ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు […]

  • Publish Date - July 4, 2023 / 01:29 AM IST

Bihar

  • జేడీయూలో తిరుగుబాటు ఖాయం
  • తొక్కిసలాట జరిగే పరిస్థితులున్నాయి
  • బీజేపీ నేత సుశీకుమార్‌ మోదీ వ్యాఖ్యలు
  • చాలామంది టచ్‌లో ఉన్నారని వెల్లడి

పాట్నా: మహారాష్ట్రలో తాజాగా అనుసరించిన తన సహజ పన్నాగాలనే బీహార్‌లోనూ అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యాఖ్యలు గమనిస్తే.. దాల్ మే కుచ్‌ కాలా హై అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ‘బీహార్‌లో కూడా త్వరలోనే తిరుగుబాటు వస్తుంది’ అని చెందిన సీనియర్‌ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోదీ చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.

ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూలో తిరుగుబాటు పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు’ అని మోదీ సోమవారం పేర్కొన్నారు. ‘ఏ క్షణంలోనైనా జేడీయూలో ‘తొక్కిసలాట’ జరిగే అవకాశం ఉన్నది’ అని ఆయన చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలవని నితీశ్‌కుమార్‌.. ఇప్పుడు వారితో అరగంట పాటు మంతనాలు జరిపారని అన్నారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని తన నాయకుడిగా నితీశ్‌కుమార్‌ అంగీకరించడం, తన రాజకీయ వారసుడిగా తేజస్వీయాదవ్‌ను ప్రకటించడం నేపథ్యంలో పార్టీలో తిరుగుబాటు వాతావరణం మొదలైందని సుశీల్‌కుమార్‌ మోదీ పేర్కొన్నారు. నితీశ్‌కుమార్‌ మళ్లీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నదన్న వార్తలపై స్పందిస్తూ.. అందుకు అవకాశమే లేదన్నారు.

దాదాపు 17 ఏళ్లు నితీశ్‌ను బీజేపీ భరించిందని, ఇక మళ్లీ ఆయనను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమిత్‌షా కూడా స్పష్టంగా చెప్పారని తెలిపారు. నితీశ్‌కుమార్‌ బీజేపీ కార్యాలయానికి వచ్చి తన ముక్కు అరగదీసుకున్నా.. ఎన్డీఏ లోనికి రానిచ్చేది లేదని అన్నారు. ఆయన లగేజీని తాము మోయలేమని చెప్పారు.

తాజాగా సుశీల్‌మోదీ, గతంలో కేంద్రమంత్రి అథవలే జేడీయూ గురించి చెబుతున్నా.. నిజానికి ఏక్‌నాథ్‌ శిండే మహారాష్ట్రలో శివసేనను చీల్చిన సమయంలోనే బీహార్‌లోనూ ఆ తరహా పరిణామాలపై సంకేతాలు వచ్చాయి. అది జరిగిన కొద్ది నెలలకే.. తన పార్టీలో చీలికను నివారించేందుకు నితీశ్‌కుమార్‌ ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. రాష్ట్రంలో తనకు అప్పటి వరకూ ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర కొన్ని పార్టీలతో చేతులు కలిపి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ.. బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు.

మొదట నితీశ్‌ టీమ్‌లో కీలక నేత ఉపేంద్ర కుష్వహా జేడీయూ నుంచి బయటకు వచ్చి.. కొత్త కుంపటి పెట్టుకున్నారు. సహజంగానే ఆయన బీజేపీతో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయబోతున్నారు. కుష్వహా తర్వతా.. హిందూస్థానీ అవమ్‌ మోర్చా ఎన్డీఏ పంచన చేరింది. ఈ పార్టీ నుంచి జీతన్‌ రాం మాంఝీని నితీశ్‌, వామపక్షాలు కలిసి కొద్దికాలం ముఖ్యమంత్రిని చేశాయి. సరిగ్గా మహారాష్ట్రలో అనుసరించిన పద్ధుతులనే బీజేపీ ఇక్కడ కూడా అనుసరిస్తున్నదనేందుకు ఇవి సంకేతాలని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజాగా మరోసారి కుట్రలు మొదలయ్యాయన్న వార్తల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో నితీశ్‌కుమార్‌ ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ, బీజేపీ మధ్య సుదీర్ఘకాలంగా బంధం కొనసాగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేదా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారంతా అప్పటికి ఉన్న మోదీ హవాలోనే నెట్టుకురాగలిగారు.

ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందున రాబోయే ఎన్నికల్లో భవితవ్యం ఎలా ఉండబోతున్నదనే అంశంలో కలవరానికి గురవుతున్నారు. ఇదే పాయింట్‌ను బీజేపీ పట్టుకుని.. వారికి వల వేస్తున్నదని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా మరో రాష్ట్రంలో అధికార పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వారు అంటున్నారు.

రాజ్యంగవ్యవస్థలను ధ్వసం నియంతృత్వం దిశగా మోదీ సర్కారు పరిపాలిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీని అడ్డుకునేందుకు విశాల వేదికను ఏర్పాటు చేసేందుకు ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో శరద్‌పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీని, బీహార్‌లో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూనూ చీల్చితే ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలకు గండి పడుతుందని భావించిన బీజేపీ.. ఇప్పటికే మహారాష్ట్రలో ఓ ప్రయత్నం చేసి.. కీలక నేత అజిత్‌పవార్‌ సహా 9 మందిని బయటకు రప్పించింది. ఇక బీహార్‌పై దృష్టిసారించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.