విధాత: తెలంగాణలో అధికార సాధన లక్ష్యంగా సాగుతున్న బిజెపి పార్టీ సంస్థాగత పటిష్టత లక్ష్యంగా అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టి సారించింది. ఇటీవల సశక్తికరణ్ అభియాన్ పేరుతో బూత్ కమిటీల పటిష్టత కార్యక్రమం చేపట్టిన బిజెపి తాజాగా మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ, ఎస్టీ మోర్చాల పటిష్టతపై దృష్టి పెట్టింది.
ముఖ్యంగా రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టి నియోజకవర్గాలో గెలిస్తేనే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ సీట్లు అందుకోవచ్చన్న భావనతో బిజెపి నాయకత్వం బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి అనుబంధ మోర్చాల విస్తరణకు కార్యాచరణ ప్రకటించింది.
బిజెపి మహిళా మోర్చా బలోపేతానికి ఏకంగా ఆరు నెలల కార్యాచరణ రూపొందించింది. మే నెలలో ఆదివాసీ మహిళలతో వారి ఆవాసాల్లో ఒక రోజు బస, వారి సమస్యలపై అధ్యయనం, మండలాల వారీగా మహిళా మోర్చా కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లాల నాయకత్వాన్ని ఆదేశించింది. జూన్ నెలలో వృత్తి, ఉద్యోగ రంగ మహిళలు, రచయిత్రులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళా పారిశ్రామికవేత్తలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం, ఆషాడమాసం గోరింటాకు ఉత్సవాలు నిర్వహించాలి.
జూలై నెలలో నూతన ఓటర్ల నమోదులో భాగంగా కళాశాల విద్యార్థులతో భేటీలు, హెల్త్ క్యాంపుల నిర్వహణ చేయాలి. ఆగస్టు నెలలో స్నేహయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లతో రాఖీ ధారణ కార్యక్రమాలు నిర్వహించాలి. సెప్టెంబర్ లో బాలికల, మహిళల హాస్టల్స్ సందర్శించి వారితో సమావేశం కావాలి. మహిళల సమస్యలు, రక్షణ చర్యలపై, సోషల్ మీడియాపై, సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలి.
అక్టోబర్ నెలలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో చిరుధాన్యాల నైవేద్యం, ప్రసాద పంపిణీలో మహిళలను భాగస్వామ్యం చేయాలి. అలాగే నవరాత్రుల్లో అంగన్వాడీ కిశోర బాలికలకు గౌరవ పూజలు నిర్వహించాలి. నిర్దేశిత ప్రణాళిక మేరకు అన్ని కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర మహిళా మోర్చాకు అందించాలని బిజెపి నాయకత్వం ఆదేశించింది.
ఆయా కార్యక్రమాల ద్వారా మహిళా మోర్చా విభాగంలోకి యువతులను, మహిళలను ఆకర్షించేలా చూడాలని బిజెపి అధిష్టానం మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జిల్లా కమిటీలకు ఇచ్చిందని బిజెపి రాష్ట్ర నాయకురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాల్లో మహిళా మోర్చా గ్రామ, మండల కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.