న్యాయం కోసం బోడుప్పల్ మున్సిపల్ వాసుల ఆందోళన!

భారీ మాన‌వ‌హారం.. నిరసన !! న్యాయం చేసేవ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌.. విధాత: బోడుప్పల్ మున్సిపాలిటీ వాసులు తమ భూ రికార్డుల విషయమై ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం బోడుప్పల్‌లో తమ కుటుంబాలతో హైదరాబాద్- భువనగిరి రోడ్డుకి ఇరువైపులా కాలనీల జేఏసీల ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయన్న నెపంతో తమ ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి […]

  • Publish Date - February 12, 2023 / 02:30 PM IST
  • భారీ మాన‌వ‌హారం.. నిరసన !!
  • న్యాయం చేసేవ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌..

విధాత: బోడుప్పల్ మున్సిపాలిటీ వాసులు తమ భూ రికార్డుల విషయమై ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం బోడుప్పల్‌లో తమ కుటుంబాలతో హైదరాబాద్- భువనగిరి రోడ్డుకి ఇరువైపులా కాలనీల జేఏసీల ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

తమ భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయన్న నెపంతో తమ ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదని, ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని బాధితులు వాపోయారు. మేయర్ బుచ్చిరెడ్డి నుండి మంత్రి మల్లారెడ్డి దాకా తమ సమస్యను తీసుకెళ్లినా పరిష్కరిస్తామంటూ ముఖం చాటేస్తున్నారని, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక చూస్తామని మాయమాటలతో మభ్యపెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నికల్లో తమ ఓట్లు వేయించుకొని ఎన్నికలయ్యాక మళ్ళీ గతంలో మాదిరిగానే ఓడ ఎక్కే దాకా ఓడ మల్లయ్య.. దిగాక బోడమలయ్య అన్నట్లుగా మంత్రి మల్లారెడ్డి వైఖరి ఉందని ఆరోపించారు. 1989 నుండి బోడుప్పల్ మున్సిపాలిటీలో 34 లేఅవుట్లు ఏర్పాటు కాగా వాటిలో అన్ని అనుమతులతో తాము 7000 మందిమి ఇల్లు నిర్మించుకున్నామన్నారు.

మున్సిపాలిటీకి అన్ని టాక్స్‌లు చెల్లిస్తున్నామన్నారు. 2018 నవంబర్ 13 నుండి కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిపివేయడం ప్రారంభించి, 2020 నుండి కొత్తగా నిర్మించిన ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని వాపోయారు. ఎవరో ఒకతను 1989 గెజిట్ మేరకు అవన్నీ వక్ఫ్ భూములు అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా తమకు అనుమతులు ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నించారు.

బోడుప్పల్ మున్సిపాలిటీ నుండి కొత్త లేఔట్లకు, కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడం, డోర్ నెంబర్లు ఇవ్వకపోవడం ద్వారా ఇబ్బందులు పెడుతూ, ఇంటి రుణాలు రాకుండా, రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూములన్న వ్యక్తి ఎలాంటి రికార్డు ఆధారాలు చూపకపోవడంతో పాటు తాము 1989 నుండి ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నందున తమకు ఇంటి నెంబర్లు కేటాయించి తమకు రికార్డు పరంగా ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

గతంలో ఆర్డీవో సైతం తమకు యజమాన్య హక్కులు కల్పించారని, ఇప్పుడు క్రయ విక్రయాల నిలిపివేతతో అత్యవసర పరిస్థితుల్లో తమ ఇండ్లు, ఫ్లాట్లు అమ్మకాలు సాగించుకునుకునే వారు రిజిస్ట్రేషన్లు కాక అనేక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. కొత్త ఇండ్లు నిర్మించుకునే అనుమతులు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారన్నారు.

న్యాయం కోసం తాము రెండు నెలలుగా బైక్ ర్యాలీలు, నిరసన దీక్షలు, వంటావార్పులు, మానవహారాలతో ప్రభుత్త్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు పోరాడుతున్నామన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం తమ సమస్యను ప్రస్తావించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకున్నారు.

తాము అప్పట్లో రికార్డులు చూసుకొని కొనుగోలు చేశామని, అవి వక్ఫ్ బోర్డు భూములయితే అప్పట్లో రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని, మున్సిపాలిటీ ఎలా అనుమతులు ఇచ్చిందని బాధితులు నిలదీశారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి తమ ఇబ్బందులు పరిష్కరించేందుకు ముందుకు రావాలని తాము సీఎం కేసీఆర్‌ను, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి లను కోరుతున్నామన్నారు.

అవసరమైతే భూముల రీసర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎంతో కష్టపడి కొనుగోలు చేసుకున్న తమ ఇండ్లు ఫ్లాట్లపై తమకు అన్ని హక్కులు ప్రభుత్వం కల్పించేదాకా ఉద్యమం ఆగబోదన్నారు.