విమానం గాలిలో ఉండగా ఇంజిన్‌లో మంటలు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

అమెరికాలోని మియామీ నుంచి ప్యూర్టోరికో వెళ్తున్న అట్లాస్ ఎయిర్ కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి

  • Publish Date - January 20, 2024 / 02:50 AM IST

Atlas Air | అమెరికాలోని మియామీ నుంచి ప్యూర్టోరికో వెళ్తున్న అట్లాస్ ఎయిర్ కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో మియామీ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మియామీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఈ ఘటన జరిగిందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) తెలిపింది.


విమానం బయలుదేరిన మూడు నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని మళ్లీ ఎయిర్‌పోర్టుకే మళ్లించారు. ఎఫ్‌ఏఏ ప్రకారం.. విమానంలోని రెండో ఇంజిన్‌లో ఈ మంటలు చెలరేగాయి. విమానాన్ని తనిఖీ చేయగా నంబర్-2 ఇంజిన్‌కుపై రంధ్రం కనిపించినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10:40 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.


ఇంజిన్‌లో మంటలు చెలరేగిన సమయంలో మియామీలోని కెండాల్‌లోని తన ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు మంటలు, నిప్పురవ్వల్లో విమానం దూసుకెళ్తుండడం కనిపించిందని.. దాన్ని చూసి భయపడ్డానని.. విమానం కూలిపోతున్నట్లుగా భావించినట్లు తెలిపింది.


రాత్రి 11 గంటల సమయంలో విమానాన్ని వియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్‌ చేసినట్లు అట్లాస్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అయితే, విమానంలో ఏదైనా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయా? ఏదైనా వస్తువు ఢీకొట్టడంతో జరిగిందా? అనేది తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు ఎయిర్‌లైన్‌, ఎఫ్‌ఏఏ తెలిపాయి. ప్రమాదానికి విమానం బోయింగ్‌ 747-8 కార్గో విమానమని వివరించింది.