విధాత, బ్యూరో కరీంనగర్: జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, రైతులెవ్వరు అధైర్యంచెందవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) తెలిపారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లి, రాంచంద్రాపూర్, దత్తోజిపల్లి, చొప్పదండి మండల పరిధిలోని మంగళపల్లి, లక్ష్మిపురం గ్రామాలను సందర్శించారు.
వడగండ్లతో నష్టపోయిన వరి, మొక్కజొన్న, మామిడి, వాటర్ మిలన్ తదితర పంటలను జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (MLA Sunke Ravi Shankar), అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వానల వల్ల జిల్లాలో సుమారు 21వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతినగా, 18వేల రైతులు ఆర్థిక నష్టాలను చవి చూశారన్నారు.
పంటనష్టానికి సంబంధించిన నివేదికలను తక్షణం సిద్దం చేసి సమర్పించాల్సిందిగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వం తరపున ప్రతిరైతును ఆదుకుంటామని ఈ సందర్బంగా అయన హామీ ఇచ్చారు.
చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టం భారీస్థాయిలో ఉందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ , జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ తో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు
పంట నష్టం పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.