బెంగళూరు రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు
రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గవర్నర్ అధికార నివాసానికి గుర్తుతెలియని అగంతకుడు కాల్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు

- అర్ధరాత్రి వేళ అగంతకుడి నుంచి ఫోన్ కాల్
- మహారాష్ట్ర సరిహద్దులోని బీదర్ జిల్లా నుంచి
- కాల్ చేసి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసినట్టు గుర్తింపు
విధాత: బెంగళూరులోని రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కర్ణాటక గవర్నర్ అధికార నివాసానికి గుర్తుతెలియని అగంతకుడు కాల్ చేసినట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఎన్ఐఏ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే వారు కర్ణాటక పోలీసులు, భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా చేశారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌లు రాజ్‌భవన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎలాంటి అనుమానిత వస్తువు రాజ్‌భవన్ పరిసరాల్లో కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన బీదర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసిన అనంతరం దుండగుడు సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్టు తేల్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్ చాంద్ గెహ్లాట్ రాజ్‌భవన్‌లో లేరు. ఆయన బెలగావిలో ఉన్నారు.