అన్ని వ‌న్‌సైడ్ మ్యాచ్‌లే.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఇంత బోరింగ్‌గా మారిందేంటి..!

  • By: sn    latest    Oct 16, 2023 1:53 AM IST
అన్ని వ‌న్‌సైడ్ మ్యాచ్‌లే.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఇంత బోరింగ్‌గా మారిందేంటి..!

ఇండియా వేదిక‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ 5 నుండి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌ది జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొన‌గా, ప్ర‌తి జ‌ట్టు కూడా మిగ‌తా తొమ్మిది టీంతో ఆడాల్సి ఉంది. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ అంటే ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్‌లు చూడొచ్చేనే ప్ర‌తి క్రికెట్ ప్రేమికుడిలో ఉంది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌లు అన్నీ కూడా ఏక‌ప‌క్షంగానే సాగాయి.

పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ అయితే పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది. ఈ మ్యాచ్‌లో పూర్తిగా ఇండియానే డామినేట్ చేసి ఘన విజ‌యం సాధించింది. ఒక్క వ‌న్డే మ్యాచ్ కూడా వంద ఓవ‌ర్ల పాటు జ‌ర‌గ‌లేదంటే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు ఎంత చ‌ప్ప‌గా జ‌రుగుతున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.


డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో మొదలు ఆదివారం జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ వరకు అన్ని కూడా వ‌న్‌సైడ్ మ్యాచ్‌లుగానే మారాయి. హైదరాబాద్ వేదిక‌గా పాకిస్తాన్, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ మాత్ర‌మే కాస్త మ‌జా అందించింది. ఈ మ్యాచ్‌లో రెండు టీంలు 50 ఓవ‌ర్ల‌పాటు ఆడారు.


ఇక రీసెంట్‌గా జ‌రిగిన భారత్-పాక్ మ్యాచ్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త పోరుగా నిలిచిపోయింది. గ‌తంలో చూస్తే భార‌త్ -పాక్ మ‌ధ్య‌ ఏడు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగి అభిమానులకి థ్రిల్లింగ్ అందించాయి.. 2003, 2011లో భారత్-పాకిస్థాన్ జట్లు విజయం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాయి.


ఇక ఆదివారం ఇంగ్లండ్‌-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కూడా చ‌ప్ప‌గానే సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా, ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), ఇక్రామ్ అలిఖిల్(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో అద‌ర‌గొట్టారు. ఇక లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.


ఆఫ్ఘ‌నిస్తాన్‌పై కూడా ఇంగ్లండ్ పూర్తి ఓవ‌ర్లు ఆడ‌లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. టీ20 ఫార్మాట్లకు అలవాటు పడ్డ ఆటగాళ్లు.. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోతుండ‌డంతో మ‌జా రావ‌డం లేదు. కనీసం రానున్న రోజుల‌లో అయిన హోరాహోరీ మ్యాచ్‌లు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.