విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ గతంలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావుకు టికెట్ నిరాకరించి, ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ ను ఇస్తున్నట్టు ప్రకటించింది.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు మినహా, అన్ని సిటింగ్ ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ అభ్యర్థులకే టికెట్ ప్రకటించింది. మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఖానాపూర్ సిటింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
రేఖా నాయక్ ఇప్పటికే బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. ప్రకటించిన అభ్యర్థిపై అనేక ఆరోపణలు కూడా చేశారు. ఇప్పటికే తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధి పనుల కోసం నిధులను ఇవ్వకుండా ఆపుతున్నారని ఆరోపించారు.అలాగే ఆసిఫాబాద్ నియోజవర్గంలో ఆత్రం సక్కు స్థానంలో ప్రస్తుత ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి, ఆత్రం సక్కుకు అదిలాబాద్ ఎంపీ స్థానాన్ని ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత పార్టీ అభ్యర్థి కలిసి పార్టీ గెలుపు కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు.
బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కు టికెట్ నిరాకరించి, ఆయన స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ ను ప్రకటించినప్పటి నుండి రాథోడ్ బాబురావు అసంతృప్తితో రగులుతున్నారు. టికెట్ తనకే ఇవ్వాలని కోరడానికి రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాదులో మకాం వేసి మంత్రి కేటీఆర్ ని కలవడానికి అపాయింట్మెంట్ కోసం తిరిగినప్పటికీ ఫలితం లేదు. పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకు మూడు రోజుల నుంచి హైదరాబాదులో మంత్రి కేటీఆర్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కురాజీనామా చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. కారు దిగి హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.