BRS | కొర్రెములలో బరి జనిగ

BRS కొనుగోలు చేసింది కొంత భూమే కానీ.. మొత్తం భూమిపై పెత్తనం పట్టాభూమి వదిలి పక్క రైతుల భూమిలో జేకే కన్వెన్షన్‌ నిర్మాణం ప్రభుత్వ భూమినీ ఆక్రమించారు ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు బీఆర్‌ఎస్‌ నేత రమేశ్‌పై ఆరోపణలు మా నాన్న‌, చిన్నాన్న‌,పెద్ద నాన్న‌లంద‌రికీ క‌లిపి ఔట‌ర్ రింగురోడ్డు ప‌క్క‌న రూ.36 కోట్ల విలువైన భూమి ఉంది. మాకు ధ‌ర‌ణిలో ప‌ట్టాలున్నాయి. తాత‌ల కాలం నుంచి హ‌క్కులున్నాయి. కానీ జ‌డిగ ర‌మేశ్‌ అనే బీఆర్ఎస్ లీడ‌ర్ మా […]

BRS | కొర్రెములలో బరి జనిగ

BRS

  • కొనుగోలు చేసింది కొంత భూమే
  • కానీ.. మొత్తం భూమిపై పెత్తనం
  • పట్టాభూమి వదిలి పక్క రైతుల భూమిలో జేకే కన్వెన్షన్‌ నిర్మాణం
  • ప్రభుత్వ భూమినీ ఆక్రమించారు
  • ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు
  • బీఆర్‌ఎస్‌ నేత రమేశ్‌పై ఆరోపణలు

మా నాన్న‌, చిన్నాన్న‌,పెద్ద నాన్న‌లంద‌రికీ క‌లిపి ఔట‌ర్ రింగురోడ్డు ప‌క్క‌న రూ.36 కోట్ల విలువైన భూమి ఉంది. మాకు ధ‌ర‌ణిలో ప‌ట్టాలున్నాయి. తాత‌ల కాలం నుంచి హ‌క్కులున్నాయి. కానీ జ‌డిగ ర‌మేశ్‌ అనే బీఆర్ఎస్ లీడ‌ర్ మా భూమిలో అనుమ‌తులు లేకుండానే ఫంక్షన్‌ హాల్‌ క‌ట్టాడు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. ఇప్ప‌టికే ఆ భూమి ఫిక‌ర్‌తో మా చిన్న‌మ్మ చ‌నిపోయింది. ఆ భూమి రాకుంటమాయే. మా పెండ్లీలు కాకుంట‌మాయే. కానీ మా అమ్మ‌, నాన్న‌, మా చిన్నాన్న‌,పెద్ద నాన్న‌లు మాకు ద‌క్కితే చాలు. ఆ ర‌మేశ్‌ వాళ్ల‌నేమైనా చేస్తాడేమోన‌ని భ‌యంగా ఉంది.
– అనూష‌, మ‌నీష ఆవేద‌న ఇది.

ఫిక‌ర్‌తో నా భార్య చ‌నిపోయింది…

ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో ఔటర్‌ రింగురోడ్డు పక్కనే మా అన్న‌ద‌మ్ములంద‌రికీ ప‌ట్టా భూములున్నాయి. మా పక్కనే ఉన్న మా అన్న బిడ్డల భూములను సింగిల్‌ విండో డైరెక్టర్‌, బీఆర్‌ఎస్‌ లీడర్ జ‌డిగ ర‌మేశ్‌ కొనుక్కున్నాడు. అతను కొన్న భూములను వదిలేసి మా భూములలో భారీ కన్వెన్షన్‌ కట్టాడు. మా భూములపై మాకే హక్కులు లేవంటున్నాడు. మా ద‌గ్గ‌ర ధరణి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ భూమి ఫికర్‌తోనే నా భార్య చనిపోయింది. నా భూమి నాకు వస్తదా..? నా భూమి నాకు దక్కితే.. ఇగో తల్లిలేని నా బిడ్డ పెండ్లి చేయాలే.
– మెట్టు శ్రీశైలం ఆక్రోశం ఇది.

నాకున్న‌ది ఒక్క‌గానొక్క బిడ్డ‌. కొర్రెముల‌లో నా అన్న‌ద‌మ్ముల‌తో పాటు నాకు భూమి ఉంది. భూమి అమ్మి ఇస్తాన‌ని అప్పుచేసి బిడ్డ పెండ్లి చేసిన‌. నాకు చేత‌నైత‌లేదు. ఆ భూమిని అమ్ముకొని నా బిడ్డ ద‌గ్గ‌రే ఉందామ‌నుకున్న‌. కానీ జ‌డిగ ర‌మేశ్‌ మా భూమిని అమ్మ‌నిస్త‌లేడు. ఎవ‌రైనా వ‌స్తే బెదిరిస్తున్నాడు. నా బిడ్డ ముఖం చూడ‌క చాన్నాల్లైంది. నాకేమ‌న్న అయితే ఆ భూమి నా బిడ్డ‌కు ద‌క్కుతుందో లేదోన‌ని భ‌యంగా ఉంది.
– రైతు మెట్టు కృష్ణ కష్టం ఇది.

బూడిద సుధాక‌ర్‌, విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి:

ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామ రెవెన్యూ పరిధిలోని 334, 335, 337, 338, 339, 340 సర్వే నంబర్లలో అన్నదమ్ములు మెట్టు వెంకయ్య, మెట్టు నర్సింహ్మ, మెట్టు అచ్చయ్య అనే రైతులకు సుమారు 12 ఎకరాల భూమి ఉంది. ఇది తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి బిడ్డలకు వారసత్వంగా మారుతూ వస్తున్నది. ఔటర్‌ రింగు రోడ్డు భూ సేకరణలో భాగంగా ఇందులో కొంత భూమిని ప్రభుత్వం పరిహారం అందించి తీసుకుంది. కానీ నేటి వరకు అన్నదమ్ములు మధ్య, వారసుల మధ్య ఎలాంటి భాగపంపకాలు జరగలేదు.

అయితే ఇందులో మెట్టు నర్సింహ్మ వారుసులైన ఐలమ్మ, పోషమ్మలకు సంబంధించిన సుమారు 4 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్‌ లీడర్‌, ఘట్‌కేసర్ ఎఫ్‌ఏసీఎస్‌ డైరెక్టర్‌ జడిగ రమేశ్‌ 2011లో కొనుగోలు చేశాడు. మెట్టు వెంకయ్య, మెట్టు అచ్చయ్యల వారసుల ఆధీనంలో సుమారు 8 ఎకరాల భూమి ఉండగా ఇందులో మరో రెండు ఎకరాలను గతంలో ఇతరులకు విక్రయించారు. ప్రస్తుతం మెట్టు వెంకయ్య, మెట్టు అచ్చయ్య వారసుల పేర సుమారు 6 ఎకరాల భూమి ఉంది.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ కన్వెన్షన్‌…

ఐలమ్మ, పోషమ్మలకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రమేశ్‌ 335, 337, 338 సర్వే నంబర్లలోని నాలుగు ఎకరాల భూమితో పాటు పక్కనే ఉన్న336, 345 సర్వే నంబర్లలో ఉన్న సుమారు మ‌రో నాలుగైదెక‌రాల ప్రభుత్వ భూమిని కలిపి జేకే కన్వెన్షన్‌ పేరుతో భారీ ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించాడని బాధిత రైతులు చెబుతున్నారు. ఫంక్షన్‌ హాల్‌ నిర్మించినప్పటి నుంచి ఆ స‌ర్వే నంబ‌ర్ల‌లోని మొత్తం భూమిపై పెత్తనం చెలాయిస్తున్నాడని రైతులు వాపోతున్నారు. వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భారీ కన్వెన్షన్‌కు హెచ్ఎండీఏ నుంచి గాని, గ్రామ పంచాయతీ నుంచి కనీస అనుమతులు లేవని వారు తెలిపారు.

త‌మ‌ భూమిలో ఫంక్ష‌న్ హాల్ నిర్మించి, త‌మ‌నే వేధిపులకు గురి చేస్తున్నాడని మెట్టు వెంకయ్య, మెట్టు అచ్చయ్యల వారసులైన మెట్టు అంజనేయులు, మెట్టు యాదగిరి, శ్రీశైలంతో తదితరులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమ పట్టా భూములను తాము అనుభవించే పరిస్థితి లేదని అంటున్నారు. తమ పొలాలకు, ఏదులాబాద్‌ చెరువుకు నీళ్లు వచ్చే లింగాపూర్‌ కాల్వను కూడా పూడ్చివేశాడ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ భూమిలో తమ గ్రామానికి చెందిన బీస రామ‌య్య గౌడ్ స‌మాధి కూడా ఉంద‌ని, ఆ స‌మాధి ఎవరికీ కనిపించకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాడని రైతులు ఆరోపించారు.

ఎమ్మార్వో నుంచి కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు…

ప్రభుత్వ భూమిని ఆక్రమించి, భారీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించిన రమేశ్‌ వ్యవహారంపై గతంలో ఎమ్మార్వోకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అయితే అధికారులు నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌ఏసీఎస్‌ డైరెక్టర్‌ చందుపట్ల ధర్మారెడ్డి విధాత‌తో తెలిపారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి అక్ర‌మంగా నిర్మించిన జేకే క‌న్వెన్ష‌న్‌ను తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

మొద‌ట బెదిరించారు.. ఇప్పుడు కేసు పెట్టారు

తమకు సంబంధించిన భూములలో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్‌ హాల్‌ను అడ్డుకునేదుకు ప్రయత్నిస్తే ఘట్‌కేసర్‌ పోలీసులు తమను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి బెదిరింపులకు దిగారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర‌మేశ్‌ దౌర్జ‌న్యాల‌పై 2023 మే 25వ తేదీన ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో త‌మ‌కు వేధింపులు రెట్టింప‌య్యాయ‌ని బాధిత రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల మ‌ధ్య చిచ్చు పెట్టి, తమ భూములను వివాదాస్పదం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.