బీఆర్‌ఎస్‌ బీసీ వ్యూహం ఫలించేనా!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌కు సొంత పార్టీ నేతల నుంచే ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి

  • Publish Date - March 14, 2024 / 10:00 AM IST
  • నిజామాబాద్ నుంచి త‌ప్పుకున్న‌ ఎమ్మెల్సీ క‌విత‌
  • పోటీకి దూరంగా ఉంటున్న సిట్టింగ్‌లు, సీనియ‌ర్లు
  • బ‌ల‌మైన నేత‌లు బ‌రిలోకి దిగ‌క‌పోవ‌డంతోనే బీసీల‌కు అవ‌కాశం

విధాత‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌కు సొంత పార్టీ నేతల నుంచే ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నియోజకవర్గాల వారీగా కేసీఆర్‌ సమీక్షలు చేస్తూ అభ్యర్థులను నేతల అభిప్రాయం మేరకు ప్రకటిస్తున్నారు. అంతకు ముందే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేశారు. ఆ సందర్భంగానే మేడ్చల్‌ నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. మల్కాజ్‌గిరి నుంచి తన కుటుంబానికి టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మాట మార్చారు. తాము పోటీ చేయలేమని చేతులెత్తేశారు. సికింద్రాబాద్‌ నుంచి తలసాని తన కుమారుడికి టికెట్‌ ఇస్తే గెలిపించుకుని వస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే తలసానినే పోటీ చేయాలని కేసీఆర్‌ సూచించారని దానికి ఆయన సమ్మతి కూడా తెలిపారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన గాని, ఆయన తనయుడు సాయికిరణ్‌ గాని పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నల్గొండ, భువనగిరి స్థానాలకు కూడా ఇదే పరిస్థితి. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్‌ ఆశించారు. అయితే ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ఆనాడు పార్టీ అధిష్టానం పెద్ద‌లు హామీ ఇచ్చారు. న‌ల్ల‌గొండ‌, భువ‌న‌గిరిల‌లో ఏదో ఒక చోట పోటీ చేయాలనుకున్నారు. అలాగే కొంతకాలంగా ఆయన పని చేసుకుంటున్నారు. కానీ ఉన్నట్టుండి ఆయన కూడా పోటీకి వెనుకడుగు వేసినట్టున్నారు. అగ్రవర్ణాల వారు పోటీకి దూరంగా ఉండటంతో కేసీఆర్‌ బీసీ నేతలను ఆ స్థానాల్లో బరిలోకి దించుతున్నారు. నిజానికి కేసీఆర్‌ మంత్రివర్గంలో బడుగు బలహీనవర్గాల కంటే అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రెడ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పవర్‌ సెంటర్‌ కోసం కొట్లాడే ఆ వర్గానికి పదవుల్లో పెద్దపీట వేస్తే తనకు తిరుగుండదని ఆయన భావన అయి ఉంటుంది. కానీ ఆయన ఊహించని విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సామాజికవర్గ నేతలు పార్టీలకు అతీతంగా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. త‌మ‌కు అన్యాయం చేసింద‌ని బీసీ వర్గాలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా కేసీఆర్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీసీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారని తాజాగా విడుదలైన జాబితా చూస్తే తెలుస్తుంది. ఆయన వ్యూహం ఫలిస్తుందా? బీఆర్‌ఎస్‌ తన అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి రెండు మూడు చోట్ల అయినా గెలుస్తుందా? అన్నది చూడాలి.

ఇప్పటివరకు ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులలో ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎంపీలైన నామా నాగేశ్వర్‌రావు, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు కాగా మరో రెండు సిట్టింగ్‌ స్థానాలైన మేడ్చల్‌, వరంగల్‌ నియోజకవర్గ అభ్యర్థులను మార్చారు. ముఖ్యంగా నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయకపోవడంపై అధికార కాంగ్రెస్‌ నుంచే కాదు బీజేపీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున‌ విమర్శలు వస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయే వారి గురించి పట్టించుకోవద్దని, కష్టపడితే ఏపీలో టీడీపీ వలె మనం గోడకు కొట్టిన బంతిలా తిరిగి బలోపేతమవుతామ‌ని కేసీఆర్‌ పార్టీ నేతలకు, శ్రేణులకు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో విఫలమైందని, ప్రజలు తిరిగి మనవైపే చూస్తున్నారని చెబుతున్నారు. కానీ పోటీ చేయడానికే కాదు పార్టీలో కొనసాగడానికి చాలామంది విముఖత చూపుతున్నారని ఇటీవల పరిణామాలను చూస్తే అర్థమౌతున్నది. దీనికి కారణం పార్టీ అధినాయకత్వ వ్యవహారశైలి ఒకటైతే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఏం సాధిస్తుంది? అనే అభిప్రాయం జనాల్లోంచి వస్తున్నది. నేతల మధ్య ఐక్యత కొరవడింది. ఉదాహరణకు మెదక్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ టికెట్‌ సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన మదన్‌రెడ్డికి లోక్‌సభ సీటు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పేరు తెరమీది నుంచి కనుమరుగైంది. వొంటేరు ప్రతాపరెడ్డి అక్కడి నుంచి ప్రచారం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే బీజేపీ రఘునందన్‌రావును ప్రకటించ‌గా, కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నది. ఒకవేళ అక్కడ కేసీఆర్‌ నిలబడితే తప్ప ఆ సీటును గెలుచుకోవడం కష్టమనే అభిప్రాయం కారు పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమౌతున్నది. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఒక మెదక్‌ మినహా సిద్దిపేట, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌ అన్నీ బీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి గట్టిగా కృషి చేస్తే తప్పా బైటపడటం అంత ఈజీ కాదు అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. దీన్నిబట్టి బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నచోట కూడా పార్టీ పరిస్థితి అంత బాగాలేదని అర్థమౌతున్నది. ఇక టికెట్‌ ఆశించి దక్కని చోట, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన చోట పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో చెప్పనక్కరలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పధ్నాలుగేళ్లు ఉద్యమంలో ఉండి, పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఓటమి తర్వాత పార్టీ నిర్మాణ లోపాలు బైటపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ బీజేపీకి అభ్యర్థులను తయారు చేసే సంస్థలా మారిందనే విమర్శలున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇంకా ఏడు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ దాదాపుగా బీఎస్పీకి ఖరారైనట్టే. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నిజామాబాద్‌ స్థానాల్లో పోటీకి అగ్రవర్ణాల వారు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో శంబీపూర్‌ రాజు, కాసాని జ్ఞానేశ్వర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ వంటి బీసీ నేతలను బ‌రిలోకి దింపారు. దీంతో బీసీల‌కు పెద్ద పీట వేశార‌నే వాదన కంటే ఓడిపోయే చోట బీసీలను బలి చేస్తున్నారనే చర్చ సొంతపార్టీలోనే జరుగుతున్నదని సమాచారం. సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి, ఆదిలాబాద్‌, మెదక్‌ టికెట్లు ఎవరికి ఇస్తారు? అనే దానిపై చర్చ జరుగుతున్నది.