బీఆరెస్ నిర్ణయాలే నిరుద్యోగులకు శాపంగా…
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. గరిష్ట వయోపరిమితి, పోలీస్ నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో నెంబర్ 46 వంటివి ఉద్యోగాల భర్తీకి ఆటంకంగా మారాయి

- నియామకాల ప్రక్రియలో ఎదురవుతున్నసమస్యలు పట్టించుకోని గత సీఎం
- కోర్టు కేసులు పట్టించుకోలే.. సమీక్షలు చేయలే
- జీవో 46పై అభ్యంతరాలను పట్టించుకోని వైనం
- ఆగిపోయిన నియామకాల ప్రక్రియను మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు
- గ్రూప్ -1కు అదనంగా 60 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
విధాత: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. గరిష్ట వయోపరిమితి, పోలీస్ నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో నెంబర్ 46 వంటివి ఉద్యోగాల భర్తీకి ఆటంకంగా మారాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చి 2022లో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 అక్టోబర్ 4 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. కోర్టు కేసుతో నియామక ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది.
దీనిపై గత ప్రభుత్వం సంబంధిత అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లడానికి చర్యలు చేపట్టి ఉంటే ఉద్యోగాల భర్తీ ఎప్పుడో పూర్తయ్యేవి. కానీ గత సీఎం ఎన్నడూ నియామకాల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, కోర్టు కేసుల గురించి పట్టించుకోలేదు. సమీక్ష చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఏమిటీ వివాదం..?
కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగాల భర్తీ జరగాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా తెరపైకి వచ్చిన కంటీజియస్ డిస్ట్రిక్ట్ కేడర్ (సీడీసీ) ఈ వివాదానికి కారణమైంది. టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌లు అన్ని జిల్లాల్లో లేని కారణంగా పొరుగునే ఉన్న మూడు, నాలుగు జిల్లాలను కలిపి సీడీసీ క్యాడర్‌ను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన పోస్టులను కేటాయించడానికి ప్రభుత్వం జీవో నంబర్ 46ను జారీ చేసింది.
దీని ప్రకారం రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని టీఎస్‌ఎస్‌పీ పోస్టులను కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాలకు తక్కువ వస్తాయని, దాంతో కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటుందని, ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని, ప్రతిభావంతులకు న్యాయం జరగాలంటే ఈ జీవోను మినహాయించి నియమాకాలు చేపట్టాలంటున్న వారి ప్రధాన ఆందోళన.
అదే సమయంలో ఎక్కువ జనాభా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఎక్కువ పోస్టులున్నాయి. అక్కడి అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం పొందే అవకాశం ఉన్నది. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందనేది గ్రామీణ అభ్యర్థుల వాదన. వీరికి పోటీగా జీవో నం. 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని మరికొందరు ఆందోళన చేస్తున్నారు.
జీవో నంబర్ 46పై అభ్యంతరాలు ఇవీ
- మిగిలిన రాష్ట్రస్థాయి పోస్టులైన ఎస్‌ఆర్‌సీపీఎల్, ఎస్పీఎఫ్ పోస్టులకు వర్తించని జీవో 46 టీఎస్‌ఎస్‌పీ పోస్టులకు ఎందుకు వర్తింపజేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
| - టీఎస్‌ఎస్‌పీ రాష్ట్ర స్థాయి పోస్టు అయినప్పడు రాష్ట్రస్థాయిలోనే కటాఫ్ మార్కులు పరిగణనలోకి తీసుకోవాలని అలా కాకుండా జిల్లాల వారీగా ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. 2015, 2018 నోటిఫికేషన్‌లో టీఎస్‌ఎస్‌పీ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నారని ఈ జీవోను వ్యతిరేకిస్తున్నవాళ్లు గుర్తుచేస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో సివిల్, ఏఆర్ పోస్టులు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి అభ్యర్థులు అధిక మార్కులు పొందినా ఉద్యోగం సాధించడం కష్టం. సీడీసీతో రాష్ట్రస్థాయి పోస్టుగా ఉండే టీఎస్‌ఎస్‌పీలోనూ అవకాశం లేకుండా పోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
- జీవో 46 కారణంగా గ్రేట్ హైదరాబాద్‌లో 53 శాతం ఉద్యోగాలు దక్కగా.. మిగతా జిల్లాలకు 47 శాతం మాత్రమే మిగిలాయని వారు చెబుతున్నారు. ఉదాహరణకు ములుగు జిల్లాకు కేవలం 36 పోస్టులే కేటాయించారని పేర్కొన్నారు. ఇదే విషయంపై గతంలోనే పీసీసీ సినియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావుకు లేఖ రాశారు. జీవో 46ను రద్దు చేసి, పాత జీవో ప్రకరామే నియామకాలు చేటపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
ఈ జీవో వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 వల్ల నిరుద్యోగులకు ఒనగూరిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని అర్థమౌతున్నది. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించడం మినహా మరో మార్గం లేదని అడ్వకేట్ జనరల్ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి సూచించారు అంటే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇకపై జారీ చేయబోయే కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ఈ జీవో రద్దుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం అధికారులతో చెప్పినట్టు సమాచారం.

వయో పరిమితి పెంపు విషయంలోనూ అంతే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి గతంలో 34 ఏళ్లుగా ఉండేది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో ఈ పరిమితిని 10 ఏళ్లు పొడిగించి 44 ఏళ్లుగా ఖరారు చేసింది. ఆ ఉత్తర్వు రెండేళ్లు అమల్లో ఉంటుందని నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2017 నుంచి 2022 వరకు వయోపరిమితి గురించి ఆలోచన చేయలేదు. ఆ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో జరిగిన నియామకాలు, సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లలో నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది.
లక్షలాదిమంది నిరుద్యోగులకు సంబంధించిన వయోపరిమితి విషయంలో గత ప్రభుత్వ అలసత్వం వల్ల చాలామంది అవకాశాలు కోల్పోయింది. ఒక జీవో కాలపరిమితి అయిపోతే దానిపై సమీక్ష చేసి అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని మళ్లీ ఆ వయో పరిమితి పెంచుతూ మరో జీవో విడుదల చేయడం వంటివి ప్రజాప్రభుత్వాలు చేయాల్సిన పని. కానీ గత ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు.
అసలు వాళ్లు మాకు ఓటు వేయకున్నా మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న విశ్వాసం గత ప్రభుత్వ పెద్దలకు ఉండేది. అందుకే ‘నీళ్లు, నిధులు, నియామకాల’ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నినాదానికే పరిమితం చేసిందనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ తీసుకున్న అనేక విధానపరమైన లోపాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
అనుబంధ నోటిఫికేషనా? కొత్త నోటిఫికేషనా?
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల నిరుద్యోగులకు చాలా నష్టం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఒకసారి పేపర్ లీకేజీ వల్ల మరోసారి పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా హైకోర్టు రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే నియామక ప్రక్రియకు దీనివల్ల జాప్యం జరుగుతుందని ప్రస్తుత సర్వీస్ కమిషన్ బోర్డు ఆ కేసును వాపస్ తీసుకున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల ఆగిపోయిన గ్రూప్స్ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అలాగే నిరుద్యోగులు ఏవరూ నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. గతంలో ఇచ్చిన 503 పోస్టులకు మరో 60 పోస్టుల ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది. ఈ కొత్త పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలా? లేక మొత్తం ఖాళీలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల అన్న అంశంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నది. వారి సూచనల ఆధారంగా ఈ నెలాఖరున లేదా మార్చి మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం.