బీజేపీ, కాంగ్రెస్‌ల విధానాలు బీఆర్‌ఎస్‌కు లాభం చేస్తాయా?

లోక్‌సభ ఎంపీ టికెట్లు కాంగ్రెస్‌లో కుంపటి రాజేశాయి.

  • Publish Date - March 28, 2024 / 02:08 AM IST

లోక్‌సభ ఎంపీ టికెట్లు కాంగ్రెస్‌లో కుంపటి రాజేశాయి. అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పటికీ 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటివరకు ప్రకటించిన వాటిలోని కొన్నిస్థానాల్లో సొంతపార్టీ శ్రేణుల నుంచే నిరసన వ్యక్తమౌతున్నది. పెద్దపల్లిలో గడ్డం వంశీ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పుతున్నారు. సికింద్రాబాద్‌ స్థానానికి దానం నాగేందర్‌ ను ఎంపిక చేయడంపై కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. చేవెళ్లలోనూ రంజిత్‌రెడ్డి కి టికెట్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. 

ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై సొంతపార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొంతమంది వాళ్లంతా కేసీఆర్‌ కోవర్టులు అంటే మరికొందరు పార్టీ కోసం కష్టపడిన వాళ్లను కాదని వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లింది అంటే సోషల్‌ మీడియా వేదికగా, యూట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినవారు.. ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లిన వారికి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో వారినే నిలదీసే స్థితికి తీసుకెళ్లాయి. అందుకే బీఆర్‌ఎస్‌ నేతలను టికెట్లు ఇవ్వడానికి వాళ్లు కూడా తప్పుపడుతున్నారు. ప్రజలు కోరుకున్నది ఇది కాదని, అలా చేస్తే గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు పెద్ద తేడా ఏమీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ నియో.జకవర్గాల్లో తెరపైకి వస్తున్న పేర్ల అంశంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో కాకరేపుతున్నది. ముఖ్యంగా ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిత టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంలోనే బలప్రదర్శన చేశారు. ఒక్కో కుటుంబానికి ఒక్క టికెట్‌ అనేది పార్టీలో అందరికీ వర్తించాలని.. కానీ మా కుటుంబం విషయంలోనే దీనిపై చర్చ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె పార్టీలోని స్థానిక నేతల మధ్య వాపోయినట్టు సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆ టికెట్‌ తన సోదరుడు ప్రసాదరెడ్డికి ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్‌ అధిష్ఠానం బీసీని బరిలోకి దింపుతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భట్టి, పొంగులేటి ఫ్యామిలీలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారా అనేది అనుమానంగానే ఉన్నది. అలాగే ఎస్సీ రిజర్వ్‌ స్థానాల్లో ఇప్పటికే రెండు టికెట్లు మాల సామాజిక వర్గానికి ఇచ్చారని కనుక వరంగల్‌ టికెట్‌ మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్‌ వస్తున్నది. అక్కడ పార్టీ టికెట్‌ ఆశించి పార్టీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో పాటు మరికొందరు వేచి చూసే ధోరణలో ఉన్నారు. అద్దంకి దయాకర్‌ ను అక్కడి నుంచి బరిలో దింపుతారనే టాక్‌ వినిపిస్తున్నది. వీళ్లను కాదని కొత్త వ్యక్తికి ఇస్తే వీళ్లంతా పార్టీ కోసం పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంపై కూడా పీటముడి వీడటం లేదు. అక్కడ హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డితో పాటు తీన్మార్‌ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లద్దరి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. 

ప్రకటించిన కొన్ని స్థానాలపై.. పెండింగ్‌లో ఉన్న మరికొన్న స్థానాలపై కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో భిన్నవాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలు గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలనే రాష్ట్ర నాయకత్వ ఆలోచన నెరవేరుతుందా? అలాగే బీజేపీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే పెద్ద పీట వేసింది. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆలస్యం.. కాషాయ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ మాజీ నేతలపై వ్యతిరేకతతో అంతిమంగా బీఆర్‌ఎస్‌కు లాభిస్తుందా? ఆ పార్టీ మూడు నుంచి నాలుగు స్థానాలు ఈ రెండు పార్టీల వల్లే చేజిక్కించుకుంటుందా? అనేలా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కనిపిస్తున్నదని క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యక్తమౌతున్న అభిప్రాయం ద్వారా తెలుస్తోంది.