వరుస వలసలు.. లోక్‌సభ ఎన్నికల వేళ బీఆరెస్ డీలా

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆరెస్ నుంచి వరుస వలసలు ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ సిటింగ్ ఎమ్మెల్యే

  • Publish Date - March 17, 2024 / 03:25 PM IST
  • కాంగ్రెస్‌లోకి మరికొందరు ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్‌ ‘గేట్లు’ తెరవడంతో వరుస చేరికలు
  • గతంలో సీఎంను కలిసిన కొందరు ఎమ్మెల్యేలు
  • వారి దారి కూడా గాంధీభవన్‌వైపేనా?
  • గందరగోళంలో బీఆరెస్‌ కార్యకర్తలు
  • నేతలే కారు దిగుతుండటంతో నైరాశ్యం

విధాత, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ బీఆరెస్ నుంచి వరుస వలసలు ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ సిటింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల వరకే పరిమితమైన వలసలు ఇకముందు ఎమ్మెల్యేల రూపంలో జోరందుకుంటాయని భావిస్తున్నారు. వారం పది రోజుల్లో నలుగురైదుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని, మొత్తంగా త్వరలోనే 15మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని గట్టి ప్రచారం వినిపిస్తున్నది. దానం, రంజిత్‌రెడ్డి చేరికలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తాము వలసకు గేట్లు తెరిచామని, ఇంక బీఆరెస్ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పదవులు అనుభవించిన నేతలే పార్టీని వీడుతుండటంతో తమ పరిస్థితి ఏమిటన్న గందరగోళానికి కార్యకర్తలు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన తరుణంలో క్యాడర్‌కు భరోసానిస్తూ ముందుండి నడిపించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలే కారు దిగి పోతుండటం.. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో పార్టీ శ్రేణుల్లో మరింత నైరాశ్యం కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు వరుసగా సాగుతున్న బడా నేతల వలసలు.. కనీసం రెండు మూడు ఎంపీ సీట్లయినా గెలవని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండల, గ్రామస్థాయి నాయకత్వం వరకు విస్తరిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

తొమ్మిది మంది ఎంపీల్లో పార్టీ మారిన ఐదుగురు

బీఆరెస్‌కు ప్రస్తుతం 9 మంది ఎంపీలు ఉండగా.. ఇప్పటికే వారిలో ఐదురుగు గులాబీ జెండాను వదిలేశారు. వారిలో పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోగా, జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో చేరారు. ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురికి.. మాలోతు కవితకు మహబూబాబాద్‌, మన్నే శ్రీనివాస్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌, నామా నాగేశ్వర్‌రావుకు ఖమ్మం టికెట్లు కేటాయించారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇకపోతే మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, గోడెం నగేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్‌, జలగం వెంకట్రావు బీజేపీలో చేరిపోయారు. ఇక తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్‌రెడ్డి, పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి, బొంతు రాంమోహన్‌, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది.

త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు, మాజీలు

బీఆరెస్ నుంచి అడ్డుకట్ట లేనట్లుగా సాగుతున్న వలసల ప్రవాహంలో భాగంగా ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాటలో త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి, అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా కారు దిగే ఆలోచనలో ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారం బీఆరెస్‌ను కలవర పెడుతున్నది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న కవితను కాపాడే ప్రయత్నంలో ఉండగా, ఇదే సమయంలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసను సీఎం రేవంత్‌రెడ్డి ప్రొత్సహించడం గమనార్హం.