కృష్ణా జలాలపై అసెంబ్లీలో కౌంటర్‌ ఎటాక్‌

కృష్ణా న‌దీ జ‌లాల వివాదం, యాజ‌మాన్య నిర్వ‌హ‌ణ అంశంపై కాంగ్రెస్‌, బీఆరెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది

  • By: Somu    latest    Feb 05, 2024 11:42 AM IST
కృష్ణా జలాలపై అసెంబ్లీలో కౌంటర్‌ ఎటాక్‌
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం
  • నేడు దక్షిణ తెలంగాణ ప్రాంత బీఆరెస్‌ ఎమ్మెల్యలే, ఎమ్మెల్సీలతో భేటీ
  • అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్లగొండలో బీఆరెస్‌ భారీ సభ


విధాత‌: కృష్ణా న‌దీ జ‌లాల వివాదం, యాజ‌మాన్య నిర్వ‌హ‌ణ అంశంపై కాంగ్రెస్‌, బీఆరెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ఈ నేప‌థ్యంలో ఈ నెల‌ 8వ తేదీ నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై గ‌ట్టిగా కౌంట‌ర్ అటాక్ చేయాల‌ని బీఆరెస్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంత‌మైన ద‌క్షిణ తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌తో బీఆరెఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం (06-02-2024) తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే ల‌క్ష్యంగా కేసీఆర్ ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని పార్టీ తెలిపింది.


అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భ‌వ‌న్‌కు వెళుతున్నారు. ఈ స‌మావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలలో అనుస‌రించాల్సిన వ్యూహంపై కూడా చ‌ర్చిస్తారు. వీటితో పాటు క్యాబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.


అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత‌ న‌ల్ల‌గొండ జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ‌


కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ సభ నిర్వహించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ తెలిపింది. అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత‌ రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌తో ఈ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది. న‌ల్ల‌గొండ‌లో నిర్వ‌హించే ఈ సభ‌పై కూడా మంగ‌ళ‌వారం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ద‌క్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మ‌డి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్ల‌ల నేత‌ల స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.