ఇంకా ఓటమిని ఒప్పుకోలేక పోతున్న బీఆరెస్‌?

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి

  • Publish Date - January 1, 2024 / 12:30 PM IST
  • ఎంతో చేసినా ఆదరించలేదంటూ నిర్వేదాలు
  • కేసీఆర్‌ మాట విని.. చర్చించుకున్న ఓటర్లు
  • అయినా ప్రజలు గందరగోళంలో ఓడించారంటున్న నేతలు
  • ఇప్పటికీ భజననే కోరుతున్న బీఆరెస్‌ నాయకత్వం
  • కేటీఆర్‌ తాజా ట్వీట్‌పై రాజకీయవర్గాల్లో చర్చలు



(విధాత ప్రత్యేకం)


ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. బీఆరెస్‌ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతున్నది. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించకపోవడం విచారకరం. ఎంతసేపూ తాము గొప్పగా పాలించామని చెప్పుకొంటున్నారే తప్పించి.. ప్రజలు ఎందుకు ఓడించారన్న విషయంపై నిజాయతీగా సమీక్ష చేసుకోలేకపోతున్నారు.


పాలన అంటే అభివృద్ధి ఒక్కటే కాదని ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘గత పాలకులు ప్రజలకు దూరంగా కేంద్రీకృత విధానాన్నిఅవలంబించారు. అందుకే ఇవాళ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులే దానికి నిదర్శనం. పదేళ్లలో అన్నీ చేసి ఉంటే వారంతా తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలతో ఎందుకు ప్రజాభవన్‌ ముందు బారులు తీరుతారు?’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.


ఇప్పటికీ భజనే కోరుకుంటున్నారా?


తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి రేపింది. ఎన్నికల ఫలితాలపై ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావించిన కేటీఆర్‌.. బీఆరెస్‌ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్‌ 32 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్‌ చానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడం ఈజీ అయ్యేదని ట్వీట్‌ చేశారని, దీనితో తానూ కొంతమేర ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వాలు అందించాలని, అది ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం పేర్కొంటున్నది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలను తమ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకొన్నారు.


అంతేకాదు బీఆరెస్‌ అధినేత పాల్గొన్న ప్రతి సభలో కొన్ని విషయాలు చెప్పారు. కాంగ్రెస్‌ వస్తే కరెంటు కష్టాలు తప్పవని, ఆ పార్టీలో పది పన్నెండు మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని, ఈ పదేళ్ల తమ పాలన మీ కండ్ల ముందు ఉన్నదని, మా పాలనా విధానాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని ప్రచారం చేశారు. ఇవి ఇక్కడితోనే మరిచిపోవద్దని ఊళ్లలో రచ్చబండ దగ్గర వీటిపై చర్చించాలని కోరారు. రైతుబంధు, రైతుబీమా, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇలా తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నీ ప్రస్తావించారు.


కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రధాన భూమిగా ఉన్న ఆత్మగౌరవ నినాదాన్ని బీఆరెస్‌ నేతలు అంగీకరించలేదు. ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణలో ప్రశ్నించడమే పెద్ద నేరం అన్నట్టు వ్యవహించారు. దీన్నే కదా ప్రజలు నిరసించింది. రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల వ్యతిరేకతే కాదు ఆత్మగౌరవం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఈ వాస్తవాన్ని కేటీఆర్ ఇప్పటికీ అంగీకరించకుండా ఇంకా మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టు మెడికల్‌ కాలేజీలకు యూట్యూబ్‌ చానళ్లకు లింక్‌ పెట్టడం అంటే ఇంకా వీళ్లు భజన కోరుకుంటున్నారని అర్థమౌతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


కాళేశ్వరం విషయంలోనూ అంతే


ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని తక్కువ కాలంలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా చిత్రీకరించి జనాలను బస్సుల్లో తీసుకెళ్లి చూపెట్టారు. ఎన్నికలకు ముందు మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు గానీ, అంతకు ముందు వరదలకు పంప్‌ హౌజ్‌లు ముగినిపోయినప్పుడు గానీ ఎవరినీ అనుమతించలేదు. జర్నలిస్టులను కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లనీయలేదు. కానీ మొన్న మంత్రులు మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించినప్పుడు పదుల సంఖ్యలో జర్నలిస్టులందరినీ తీసుకెళ్లారు. ‘ఇది కదా ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్నవి నిషేధ పదాలుగా వారి పాలన విధానాలున్నాయన్నది


బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత అనేకమంది పత్రికల్లో, సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా తాము అద్భుతంగా పాలించామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు కన్ఫ్యూజన్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడ గొట్టారు అని నిందను ప్రజలపై నెడుతున్నారు. నేరం మాది కాదు ప్రజలది అన్నట్టు బీఆర్ఎస్‌ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అధికారం కోల్పోడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు అనడానికి వారి మాటలే ఉదాహరణలు’ అని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు వ్యాఖ్యానించారు.