మ్యూజియాలజి నిపుణులు వీరేందర్
విధాత: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని ప్రముఖ మ్యూజియాలజీ నిపుణులు ఎం.వీరేందర్ అన్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన బుద్ధ వనాన్ని సందర్శించారు.
దీనిలో భాగంగా బుద్ధ వనంలోని గౌత బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే బుద్ధ చరితవనం, 40 జాతక కథలు ఉన్నటువంటి జాతకవనం, శ్రీలంక దేశపు అవకుణ బుద్ధ విగ్రహం ఉన్నటువంటి ధ్యానవనం, దేశ విదేశీయ స్థూపం నమూనాలతో ఉన్నటువంటి స్థూప వనం, అపురూపమైన శిల్పకళతో నిండిన మహాస్థూపాన్ని సందర్శించారు. మహా స్తూపం అంతర్భాగంలో జర్మనీ సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిన 548 పద్మ దళాల నిర్మాణాన్ని, మహా స్థూపంలోని ధ్యాన మందిరాన్ని ఆసక్తిగా వీక్షించారు.
బుద్ధ వనాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, అధికారులు సుధాన్ రెడ్డి క్రాంతి బాబు, శ్యామ్‌సుందర్‌రావు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వీరికి బుద్ధ వనం కన్సల్టెంట్ బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుద్ధ వనం విశేషాలను వివరించారు. వీరితో పాటు బుద్ధ వనం డిజైన్ ఇన్‌చార్జిశ్యాంసుందర్‌రావు తదితరులు ఉన్నారు