Tomato |
విధాత: కొండెక్కిన టమోటా ధరల భారం నుంచి సామాన్యుడికి ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ టమోటాలను అందించాలని ఆలోచిస్తోంది. గత నెల రోజులుగా టమోటా ధరలు కిలోకు 150 రూపాయల నుంచి కొన్నిచోట్ల 200 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
వేసవిలో టమోట పంట సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల డిమాండ్, సరఫరాలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలలో కొత్త టమోట పంట అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి రాష్ట్రాల నుంచి టమోటా కొని ఇతర రాష్ట్రాలకు సబ్సిడీ రేట్లకు సరఫరా చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి, టమాటా ధరలు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.
రెండు మూడు రోజుల్లో ఈ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ టమోటా ఉత్పత్తి అధికంగా ఉంటుందని, జులై- ఆగస్టు నెలల మధ్య ఇది గణనీయంగా పడిపోతుంది, అందుకే ఈ నెలల్లో ధరల పెరుగుదల ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట నష్టం వల్ల కూడా టమోటా ధరలలో ఆకస్మిక పెరుగుదలకు దారితీస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమోటా సరఫరా మొదలైందని, ఢిల్లీతోపాటు సమీప నగరాలకు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుండి స్టాక్స్ అందుతున్నాయని కేంద్రం వెల్లడించింది. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉందని, దీంతో టమోటా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులకు రైతు బజార్లు ద్వారా సబ్సిడీ రేట్లకు టమోటాలు సరఫరా చేస్తోంది. ఇదే తరహాలో కేంద్రం కూడా సరఫరా చేయాలని భావిస్తోంది.