Chandrayaan-3 ।
చంద్రుడిపై కాలు మోపడానికి ఒక్క అడుగు దూరంలో చంద్రయాన్-3 ఉన్నది. ఇప్పటి వరకూ చంద్రుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరిగిన చంద్రయాన్.. ఇప్పడు వృత్తాకారంలోకి మారింది.
స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునికి సమీపంలోకి వచ్చినందున ల్యాండర్ విడిపోనున్నది. చంద్రయాన్ వృత్తాకార పరిభ్రమణం (circularisation) మొదలైందని, ప్రస్తుతం దాదాపు 150 కి.మీ. x 177 కి.మీ. వృత్తాకార పరిభ్రమణానికి చేరువైందని ఇస్రో (ISRO) సోమవారం తెలిపింది.
తదుపరి ఆపరేషన్ ఆగస్ట్ 16 ఉదయం 8.30 గంటల సమయంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నెల 9వ తేదీన చంద్రయాన్ 3 (Chandrayaan-3) పరిభ్రమణాన్ని 174 కి.మీ. X 1,437 కి.మీ. కక్ష్యకు మార్చారు.
బుధవారం ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మోడ్ నుంచి విడిపోతాయి. అనంతరం ల్యాండర్‌ను డీబూస్ట్ (నెమ్మదించే ప్రక్రియ) చేస్తారు. ఆగస్ట్ 23వ తేదీన చంద్రునిపై ఉన్న దక్షిణ ధృవంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయిస్తారు. చంద్రయాన్ 3లో ఇదే అత్యంత కీలకమైన భాగం.
ఆ సమయంలో 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ చంద్రునిపై దిగాల్సి ఉంటుంది. ఆ సమయంలో సెకన్‌కు 1.68 కి.మీ. వేగంతో పయనిస్తుంది. అయితే.. ఈ వేగం ఉపరితలానికి సమాంతరంగా ఉంటుంది. అయితే దానిని ఊర్ద్వముఖంగా మళ్లించడం అత్యంత ఆసక్తికర అంశమని గతంలో ఇస్రో చైర్మన్ సోమనాథన్ చెప్పారు.
గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇక్కడే సమస్య తలెత్తిందని సోమనాథ్ వివరించారు. ఈ నేపథ్యంలో గైడెన్స్ డిజైన్ మార్చడంతో పాటు.. అనేక మార్పులు చేసినట్టు తెలిపారు.