విధాత: ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండగా ఇప్పుడు అయన కుమారుడు లోకేష్ కు సైతం కోర్టు కేసులు తప్పేలా లేవు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ ఇప్పటికే ఢిల్లీ బయల్దేరింది. లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
అయితే ముందస్తు బెయిల్ ను నిరాకరించిన కోర్టు ఆయనకు నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించగా ఆ విచారణకు సహకరించాలని లోకేష్ కు సైతం కోర్టు సూచించింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చేసి తమ అనుయాయులకు లబ్ది చేకూర్చి, ప్రతిగా తాను భారీగా భూములు, భవనాలు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన అప్పటి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఆయన్ను సైతం కేసులో పోందుపర్చింది.
దీంతో ఆయన్ను ఆ కుంభకోణంలో ఏ14గా చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు.
కాగా.. 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇక అయన అరెస్ట్ అవుతారా లేదా అన్నదానికి సంబంధించి సందిగ్ధం కొనసాగుతుండగా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టులు వేశారు. అది ఈరోజు విచారణకు వస్తుంది.