Adilabad: దళితుల సంక్షేమంపై.. శ్వేత పత్రం విడుదల చేయండి: CM KCRకు భట్టి బహిరంగ లేఖ

ఓట్ల కోసం అంబేద్కర్ వాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపణ దళిత గిరిజన ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణ అణగారిన వర్గాలకు చేసింది ఏమీ లేదని విమర్శ‌ విధాత, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2014లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చి పదేళ్ల తర్వాత […]

  • Publish Date - April 13, 2023 / 01:39 AM IST
  • ఓట్ల కోసం అంబేద్కర్ వాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపణ
  • దళిత గిరిజన ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణ
  • అణగారిన వర్గాలకు చేసింది ఏమీ లేదని విమర్శ‌

విధాత, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2014లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చి పదేళ్ల తర్వాత ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నారని పేర్కొన్నారు

సమాజ ఉద్ధరణకు అంబేద్కర్ ఆలోచన విధానాలను వాడాల్సిన పాలకులు ఓట్లు పొందడానికి వాడటం దుర్మార్గం అని విమ‌ర్శించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరై దళిత గిరిజనుల అభ్యున్నతికి ఏమైనా నిధులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు హాజరుకాకుండా ప్రతి సంవత్సరం దళిత గిరిజనులను అవమానించిన కెసిఆర్ ఎన్నికలవేల దళిత గిరిజనులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి మళ్లించారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళిత గిరిజనులకు ఖర్చుపెడితే చాలు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ను సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారని విమ‌ర్శించారు.

దళితులకు పంపిణీ చేస్తామన్న మూడు ఎకరాలను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద దళిత గిరిజనులకు భూ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన అసైన్మెంట్ కమిటీలను రద్దు చేశారని అని పేర్కొన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జైపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో పేదలకు ఇచ్చిన భూములను ధరణి ద్వారా వెనక్కి గుంజుకున్న హీనమైన చరిత్ర ఈ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

దళిత గిరిజన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వం, క్యాపిటల్ లిస్టులకు రియల్ ఎస్టేట్ సంస్థలకు కోట్లాది విలువైన భూములు కట్టబెడుతున్నదని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు కేటాయించిన‌ రూ.17,500 కోట్లు ఏడాది పూర్తి అయిన విడుదల చేయకపోవడం ఇంతకంటే దుర్మార్గం లేదన్నారు.

కెసిఆర్ ఎన్నికల జిమ్మికులకు తెలంగాణ సమాజం మోసపోవడానికి సిద్ధంగా లేదని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పరిపాలన అని, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తెలంగాణ దళితుల జీవితాల్లో వెలుగులు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి నేతలు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం ఈ సభకు వస్తున్నార‌న్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.