Jagananna Vasathi Deevena |
విధాత: సీఎం జగన్‌కు వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్గం అంతా ప్రశాంతంగా కూల్ గా మార్చుకుందాం అని ఎంతగా ప్రయత్నిస్తున్నా దారిపొడవునా ముళ్ళే ఎదురవుతున్నాయి. వాటిని తప్పించుకుంటూ గమ్యానికి చేరతారా? చూడాలి.
తాజాగా జగన్ ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలకు వసతి దీవెన డబ్బులు బటన్ నొక్కి అనంతపురంలో ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే ఆ ముందురోజే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవడంతో ఆ ప్రోగ్రాం రద్దు అయింది.
అయితే కేవలం కేసు, అరెస్ట్ కారణంగానే జగన్ ఆ పథకాన్ని, ఆ ప్రోగ్రామును రద్దు చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కారణం అది కాదట. నిధుల కొరత కారణంగా ఆ పథకాన్ని వాయిదా వేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్ధిక శాఖ సూచనల మేరకు వాయిదా వేశామని అంటున్నారు.
డబ్బుల్లేకుండా బటన్ నొక్కేస్తే తరువాత బ్యాంకుల్లోకి వేయాల్సిన ప్రభుత్వ చెక్కులు బౌన్స్ అయితే మరింత పరువు తక్కువ.. అందుకే పథకాన్ని డబ్బులు సమకూరేవరకూ ప్రారంభించేది లేదంటున్నారు. వెనకా ముందూ చూడకుండా ఎక్కడ లేని డబ్బంతా ఇలా బటన్లు నొక్కుకుంటూ పోతుండడంతో నిధుల కొరత వస్తోందని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉండగా జగన్ మళ్ళీ రెండు మూడ్రోజుల్లో ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. అటు నిధుల కోసం, ఇంకా పలు పెండింగ్ పథకాల మీద చర్చ కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. కేవలం తమ్ముడిని కేసుల నుంచి తప్పించడానికి వెళ్తున్నట్లు టిడిపి , అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.