CM KCR | రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడుతూ విద్వేషాలు, ఉన్మాదాన్ని రెచ్చగొడ్డుతున్న భారతీయ జనతా పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎక్కన్నో ఒక్క కాడ దీనికి బెబ్బులి లాగా పంజా లేవలే. దెబ్బ కొట్టాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఇస్తే వారు పని చేయాలి. గెలిచిన వారిని ఐదేండ్లు పని చేయనియ్యాలి. కానీ మాకు చేత కాదు.. మేం చేయం.. చేసేటోళ్లను చేయనియం. మా దొంగతనం, తెలివితక్కువన తనం బయటపడుతదని అడ్డుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. స్పందించాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి చోట చర్చ పెట్టాలి. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతాయి. తెలంగాణలో ఒకప్పుడు బాధ పడ్డాం. ఐదేండ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పాను. 24 గంటల కరెంట్ రెండేండ్లలో ఇస్తామని చెప్పాం. ఇవాళ నీళ్లు, కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణ రైతాంగం కరువు, కాటకాలకు గురైంది. ఇప్పుడు రైతులు బాగుపడుతున్నారు. చిల్లర రాజకీయాలు, ఓట్ల కోసం రైతుబంధు, రైతుబీమా ఇవ్వట్లేదు. రైతాంగం అప్పుల పాలు కావొద్దని కార్యక్రమాలు చేస్తున్నాం.
కర్ణాటక సరిహద్దులోని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. గుజరాత్‌లో మంచినీళ్లకు కష్టాలు, కరెంట్ లేదు. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీళ్ల కోతలు ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసుకుంటున్నాం అని చెబుతున్నారు. ఇంత కొత్త రాష్ట్రం, గరీబ్‌గా ఉన్న రాష్ట్రంలో అయిన పని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అయితలేదు. దయచేసి ఆలోచన చేయాలి. అన్ని పరిస్థితులను అధిగమించి అద్భుతంగా ముందుకు పోతున్నాం. వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు. నిధులు రాకుండా ప్రగతిని అడ్డుకుంటున్నారు. ఇది మంచిదేనా? తెలంగాణలో ప్రతి ఇంచు మనదే.
ఒక రాష్ట్ర బాగుపడితే అడ్డం పడుతారా? దేశ ప్రధాని చేసే పని ఇదేనా? ఎదురు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడుతామని చెబుతారు. కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కూలగొడుతా? అని ప్రధాని స్వయంగా అంటున్నారు. నీలాగానే మేం గెలిచాం కదా? ఏం అర్థం చేసుకోవాలి. మాకు ప్రజలు ఓట్లేయకుండానే గెలిచామా? ఏ కారణం చేత కూలగొడుతవు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది. మంచినీళ్లు, సాగునీళ్లు ఇయ్య చేత కాదు.. పేదలను ఆదుకోవడం చేత కాదు.. ఉన్నవన్నీ కార్పొరేట్ గద్దలకు అమ్మేస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించాలి. లేకపోతే ఆగమై పోతం. దెబ్బతింటాం. రాజకీయాల కోసం అవలంభించే ఎత్తుగడలను గమనించాలి. సీరియస్‌గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమవుతాయి. ఒక పార్టీ కోసం కాదు. ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జీవనాడి కలుషితం చేయబడుతుంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, విద్వేషాలను రెచ్చగొట్టడి, అబద్దల ఒరవడి సృష్టించి, దాడులు చేయించి, మేలైన నాయకులను ఇబ్బంది పెట్టి దుర్మార్గ పూరితమైన విధానం జరుగుతుంది. కండ్లరా చూస్తున్నాం. ఎక్కన్నో ఒక్క కాడ దీనికి బెబ్బులి లాగా పంజా లేవలే. దెబ్బ కొట్టాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.