క‌ళ్ల‌లో నీళ్లు పెట్టుకుని బాధ ప‌డ్డాం: సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ ఉద్య‌మ కాలంలో పాల‌మూరు జిల్లాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఉద్యోగులంద‌రికీ శుభాకాంక్ష‌లలు, అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఏడేండ్ల క్రితం కేవ‌లం రూ. 60 వేల కోట్ల బ‌డ్జెట్ ఉండే. ఇవాళ రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టుకుంటున్నాం. తెలంగాణ […]

  • Publish Date - December 4, 2022 / 09:26 AM IST

CM KCR | తెలంగాణ ఉద్య‌మ కాలంలో పాల‌మూరు జిల్లాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు.

నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఉద్యోగులంద‌రికీ శుభాకాంక్ష‌లలు, అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఏడేండ్ల క్రితం కేవ‌లం రూ. 60 వేల కోట్ల బ‌డ్జెట్ ఉండే. ఇవాళ రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో చాలా భ‌యంక‌ర‌మైన క‌రెంట్ బాధ‌లు అనుభ‌వించాం.

మ‌న‌కు స‌మీపంలో ఏ రాష్ట్రం కూడా లేదు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు విష‌యంలో మ‌న‌కు సాటి, పోటీ లేరు. అలాంటి ఆలోచ‌న‌లు కూడా రావు. నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, రెండింతల అంకిత‌భావంతో ప‌ని చేసిన ప్ర‌భుత్వ సిబ్బందికి ప్ర‌త్యేకంగా శిర‌సు వంచి న‌మ‌స్కారం చేస్తున్నా.

తెలంగాణ ఉద్య‌మ‌ కాలంలో పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తే అనేక అనుభావాలు, జ్ఞాప‌కాలు ఉండే. నారాయ‌ణ‌పేట నుంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు వ‌స్తుంటే న‌వాబ్‌పేట మండ‌లంలో ఫ‌తేపూర్ వ‌ద్ద అడ‌వి ఉంట‌ది. చెట్లు కూడా బ‌క్క‌గా అయిపోయిన‌యి. ఏం అన్యాయం అని ల‌క్ష్మారెడ్డిని అడిగాను. క‌ళ్ల‌లో నీళ్లు పెట్టుకుని బాధ ప‌డ్డాం.

అలంపూర్ టు గద్వాల వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన‌ప్పుడు అనేక అనుభావాలు ఎదుర‌య్యాయి. న‌డిగ‌డ్డ‌లో ప్ర‌జ‌ల బాధ‌లు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాం. వేద‌న‌లు, రోద‌న‌ల‌తో బాధ‌ప‌డ్డ పాల‌మూరు జిల్లా ఇవాళ సంతోషంగా ఉంది. ధాన్యం రాశుల‌ను చూస్తుంటే సంతోష‌మేస్తుంది. ఏ తెలంగాణ కావాల‌ని కోరుకున్నామో.. ఆ బాట ప‌ట్టింది. మ‌రింత అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించాలి.

ఎవ‌రు కూడా వెయ్యి సంవ‌త్స‌రాలు బ‌త‌కాం. భ‌గ‌వంతుడు ఇచ్చిన అవ‌కాశాన్ని బ‌ట్టి వివిధ హోదాల్లో ప‌ని చేస్తారు. ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు. ఎవ‌రైనా రిటైర్ కావాల్సిందే. మ‌న జ‌ర్నీలో చేసిన ప‌నులు చివ‌రి రోజున సంతృప్తినిచ్చేలా ఉండేలా చూసుకోవాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.