CM KCR | బ్రాహ్మణుల పని లోకహితం కోసమే.. బ్రాహ్మణ పరిషత్‌ భవన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

CM KCR | వేద పండితుల గౌరవ బృతి రూ.5 వేలకు పెంపు మరో 2,796 దేవాలయాలకు దూపదీప నైవేద్యం పథకం విస్తరణ దేవాలయాల నిర్వహణకు నెలకు ఇచ్చే మొత్తం రూ. 6నుంచి 10 వేలకు పెంపు ఐఐటి, ఐఐఎమ్‌లలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బ్రాహ్మణుల సమస్యలన్నీ కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తాం విధాత: లోక హితం కోసమే బ్రాహ్మణులు పని చేస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వారి దేహాం, మనసు మాట, చేసే పని అంతా […]

  • By: krs    latest    May 31, 2023 8:33 AM IST
CM KCR | బ్రాహ్మణుల పని లోకహితం కోసమే.. బ్రాహ్మణ పరిషత్‌ భవన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

CM KCR |

  • వేద పండితుల గౌరవ బృతి రూ.5 వేలకు పెంపు
  • మరో 2,796 దేవాలయాలకు దూపదీప నైవేద్యం పథకం విస్తరణ
  • దేవాలయాల నిర్వహణకు నెలకు ఇచ్చే మొత్తం రూ. 6నుంచి 10 వేలకు పెంపు
  • ఐఐటి, ఐఐఎమ్‌లలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • బ్రాహ్మణుల సమస్యలన్నీ కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తాం

విధాత: లోక హితం కోసమే బ్రాహ్మణులు పని చేస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వారి దేహాం, మనసు మాట, చేసే పని అంతా జగతి కోసమేనన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గోపన పల్లిలో బ్రాహ్మణ పరిషత్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ బ్రాహ్మణులకు పలు వరాలు ప్రకటించారు. బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ద్వారా వేద‌శాస్త్ర పండితుల‌కు ప్రస్తుతం ప్ర‌తి నెల ఇస్తున్న గౌర‌వ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల‌కు పెంచుతున్నామని, ఈ భృతిని పొందే అర్హ‌త వ‌య‌సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్ల‌కు త‌గ్గిస్తున్నామన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తిస్తున్న‌దని, వీటితో పాటు రాష్ట్రంలో మరో 2,796 దేవాల‌యాల‌కు కూడా ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం విస్త‌రింప‌జేస్తామన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రో శుభ‌వార్త కూడా మీతోపంచుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వ‌హ‌ణ కోసం అర్చ‌కుల‌కు నెల‌కు ఇస్తున్న రూ. 6 వేలను రూ. 10 వేల‌కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణ‌యం మీ అంద‌రిని ఎంతో సంతోష‌పెడుతుంద‌ని భావిస్తున్నానన్నారు.

వేద పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇస్తున్న రూ. 2 ల‌క్ష‌లను ఇక నుంచి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామని ప్రకటించారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దివే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వ‌ర్తింజేస్తామన్నారు. అలాగే అనువంశిక అర్చ‌కుల స‌మ‌స్య‌ల‌ను మంత్రి వర్గ సమావేశంలో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

కుల,మతాలకు అతీతంగా పేద‌రికం ఎవ‌రి జీవితంలో ఉన్నా వారిని ఆదుకోవాల‌నే మాన‌వీయ సంక‌ల్పంతో తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కులానికి పెద్ద‌లైన బ్రాహ్మ‌ణుల్లోనూ చాలా మంది పేదలు ఉన్నారని, వారిని ఆదుకోవ‌డం ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌గా భావించిందన్నారు. ఈ మేరకు 2017 ఫిబ్రవరి1న తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసుకొని ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించుకుంటున్నామని తెలిపారు.

వీటితో బ్రాహ్మణుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామన్నారు. వివేకానంద ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ను విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద బ్రాహ్మణ విద్యార్థులకు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 780 మందికి స్కాలర్‌ షిప్‌లు అందించామన్నారు. పేద బ్రాహ్మ‌ణుల జీవ‌నోపాధి కోసం బ్రాహ్మిణ్ ఎంపవ‌ర్‌మెంట్ స్కీమ్‌ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ప‌థ‌కం కింద గ్రాంట్‌గా రూ. 5 ల‌క్ష‌ల గ్రాంట్‌ను అందిస్తున్నామన్నారు. ఈ పథకానికి ఇప్పటి వరకు ప్ర‌భుత్వం 150 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

దేశంలో స‌నాత‌న సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మ‌ణ స‌ద‌నాన్ని నిర్మించిన మొట్ట‌మొద‌టి ప్ర‌భుత్వం తెలంగాణనే అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విప్ర‌హిత పేరుతో వెల‌సిన ఈ బ్రాహ్మ‌ణ స‌ద‌నం ఆధ్యాత్మిక‌, వైదిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు మార్గ‌ద‌ర్శ‌క కేంద్రంగా నిలుస్తుందన్నారు.

రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిప‌తులు, ధ‌ర్మాచార్యులకు విడిది కేంద్రంగా ఈ స‌ద‌నం సేవ‌ల‌ను అందించ‌నుందని తెలిపారు. ఈ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన క‌ల్యాణ మండ‌పం పేద బ్రాహ్మ‌ణుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 9 ఎక‌రాల్లో రూ. 12 కోట్ల‌తో బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నాన్ని నిర్మించామని తెలిపారు.

బ్రాహ్మణుల కోసం నిర్మించిన విప్రహిత స‌క‌ల జ‌న‌హిత‌గా ఆద‌రింప బ‌డాల‌న్నదే వ్యక్తిగతంగా తన అభిమతమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కుల‌మతాల‌కు అతీతంగా పేద‌వారు త‌మ ఇండ్ల‌లో నిర్వ‌హించు కునే శుభ‌కార్యాల‌కు పురోహితుల సేవ‌లు కోరితేఈ భ‌వ‌నం నుంచి వెళ్లి ఆ ఇంట్లో కార్య‌క్ర‌మాలు జ‌రిపించి రావాల‌ని కోరుతున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆయా వైదిక కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన అరుదైన పుస్త‌కాలు, డిజిట‌ల్ వీడియోలు ఈ లైబ్ర‌రీలో ల‌భిస్తాయన్నారు.

వేద‌శాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైత‌న్య కేంద్రంగా, నిత్యం భార‌త భాగ‌వ‌త రామాయాణాది కావ్య ప్ర‌వ‌చ‌నాల‌కు వేదిక‌గా, క‌ళ‌ల‌కు కొలువుగా బ్రాహ్మ‌ణ స‌ద‌నం విల‌సిల్లాలన్నారు. అలాగే వివిధ క్ర‌తువులు, ఆల‌య నిర్మాణాలు, ఆగ‌మ శాస్త్ర నియ‌మాలు, దేవ‌తా ప్ర‌తిష్ఠ‌లు, వివిధ వ్ర‌తాల విధివిధానాల‌కు సంబంధించిన ఒక సమ‌గ్ర‌మైన లైబ్ర‌రీ స‌ద‌నంలో ఏర్పాటు చేయాలన్నారు.

కోల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయం

మ‌హాక‌వి కాళిదాసు సాహిత్య ఔన్న‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన మ‌హా మ‌హోపాధ్యాయుడు కోలాచ‌ల మల్లినాథుని సూరి పేరున ఆ మ‌హానీయుని స్వ‌స్థ‌ల‌మైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ‌విద్యాల‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభిస్తున్న‌దని సీఎం వెలడించారు.

సూర్యాపేట‌లో డాక్ట‌ర్ ఏ రామ‌య్య ఇచ్చిన ఎక‌రా స్థ‌లంలో బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ భ‌వ‌నాన్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందని, దీన్ని త్వ‌ర‌లోనే ప్రారంభించుకుందామన్నారు. ఖ‌మ్మం, మ‌ధిర‌, బీచుప‌ల్లి ప్రాంతాల్లో కూడా బ్రాహ్మ‌ణ భ‌వ‌నాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తుందని తెలిపారు.

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ నిల‌యంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ఞాన స‌ర్వ‌సంగా, వైదిక క్ర‌తువుల క‌ర‌దీపిక‌గా, పేద బ్రాహ్మ‌ణుల ఆత్మ‌బంధువుగా, లోక క‌ల్యాణ‌కారిగా తెలంగాణ బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఈ విప్ర‌హిత వెలుగొందాల‌ని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సీఎం తెలిపారు.